Renu Desai: బ్యాంక్ భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన రేణూదేశాయ్.. అకౌంట్ క్లోజ్!

Renu Desai: టాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే రేణూ.. ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా సాయాలు చేసుకుంటూ వెళుతుంది. అడ‌పాద‌డ‌పా సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్ట్ లు షేర్ చేస్తుంది రేణూ. తాజాగా తన బ్యాంకింగ్‌ వ్యవహారాలపై ఒక షాకింగ్‌ విషయాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా ఆమె పోస్ట్ చేశారు. అది చూసి సదరు బ్యాంకు ఖాతాదారులతో పాటు ఇతరులు కూడా ఆశ్చ‌ర్యానికి గురయ్యారు. ఇది చాలా తీవ్రమైన తప్పు. మన ఖాతాలో వేరొకరు లాగిన్ అయ్యి, నగదు బదిలీ చేసే అవకాశాలున్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై రేణూ స్పందిస్తూ.. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయినప్పుడు, అది వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయింది. దీంతో తాను షాక్‌ అయ్యాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ వివరాలను షేర్‌ చేశారు. బ్యాంక్‌ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా వారు సీరియస్‌గా తీసుకోలేదంటూ తెలిపారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఈ ఖాతా నుంచి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్‌ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు.

బ్యాంకింగ్‌ లావాదేవీలు, భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి కొంతమంది ‘డిజిటల్ ఇండియా’ అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. కాగా, రేణూ దేశాయ్ చేసే సహాయ కార్యక్రమాలపై అప్పుడప్పుడు నెగెటివ్ కామెంట్లు వినిపిస్తుంటాయి. నేరుగా డబ్బు సాయం చేయలేనని పదే పదే చెప్పినా కూడా పలువురు నెటిజన్లు మాత్రం ఆర్థిక సాయాన్ని కోరుతుంటారు. ఇంకొందరైతే హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తున్నారు. డబ్బు సాయం అందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.