Sonu Sood: ఎట్ట‌కేల‌కు 700కి.మీ పాద‌యాత్ర చేసి సోనూసూద్‌ని క‌లిసాడు..!

Sonu Sood రీల్‌ లైఫ్‌లో విలన్‌ అయినా రియ‌ల్ లైఫ్‌లో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ రియ‌ల్ హీరోగా కీర్తించ‌బ‌డుతున్నారు. క‌రోనా కాలం మొద‌లైన‌ప్ప‌టి నుండి సోనూసూద్ చేసిన సాయాల‌కు లెక్కేలేదు. వ‌ల‌స కార్మికుల నుండి మొద‌లు పెడితే ఆక్సిజ‌న్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎంద‌రో ప్రాణాలు కాపాడడం వ‌ర‌కు సోనూసూద్ సేవ కొన‌సాగుతూనే ఉంది. కన్నీళ్లు తుడుస్తూ.. ఆకలి దప్పులు తీరుస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ప్ర‌జ‌ల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు సోనూసూద్.

సోనూసూద్‌ని దేవుడిలా కీర్తిస్తున్న కొంద‌రు అభిమానులు ఆయ‌న‌ని క‌లిసేందుకు పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. సోనూసూద్‌ని క‌లిసేందుకు వంద‌ల కి.మీలు పాద‌యాత్ర చేస్తుండ‌గా,ఇది చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మొన్నామ‌ధ్య ఓ యువ‌కుడు రోజుకు 40 కిమీ న‌డ‌చుకుంటూ పాద‌యాత్ర చేప‌ట్టాడు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న‌ని క‌లిసి చాలా సంతోషించాడు.తాజాగా తెలంగాణలోని వికారాబాద్ కు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆయ‌న ఊరి నుండి ముంబై వ‌ర‌కు పాద‌యాత్ర‌గా వెళ్లాడు.

వీపుకు రెండు జతల బ‌ట్ట‌లున్న‌ బ్యాగు తగిలించుకుని… సోనూ సూద్ ఫొటోతో ఉన్న ప్లకార్డు చేతపట్టి చలో ముంబై అంటూ బయలుదేరాడు. ‘‘రియల్ హీరో సోనూ సూద్.. టైటిల్ కింద నా గమ్యం.. నా గెలుపు ట్యాగ్ లైన్ తో..హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర అని రాసిన ప్లకార్డుతో పాదయాత్ర’’ చేశాడు. ఎండా వ‌ర్షం వంటి వాటిని లెక్క చేయ‌కుండా, ఆహారం దొర‌క్క‌పోయిన ఖాళీ క‌డుపుతోనే న‌డ‌క సాగిస్తూ ముందుకు సాగాడు. ఎంతో శ్రమ‌కోర్చి ముంబై మహానగరం చేరుకున్న యువకుడికి సోనూసూద్ ఇంటిని స్థానికులు చూపించారు.

700 కి.మీ న‌డుచుకుంటూ వ‌చ్చిన అభిమానికి సోనూసూద్ స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికాడు. ఇంటికి వ‌చ్చిన వెంక‌టేష్ యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. హైద‌రాబాద్‌కు నేను వ‌స్తుంటా క‌దా, ఎందుకు ఇంత దూరం వ‌చ్చావు. ఇలాంటి ప‌నులు మ‌ళ్లెప్పుడు చేయ‌కు అంటూ సున్నితంగా హెచ్చ‌రించాడు. ఏం చేస్తుంటావని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఈసారి హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలుద్దామంటూ అభిమాని వెంక‌టేష్‌ కు హామీ ఇచ్చాడు.

సోనూసూద్ ప్ర‌స్తుతం ఆచార్య అనే సినిమాలో న‌టిస్తుండ‌గా, ఈ సినిమా షూటింగ్ కోసం చాలారోజులు ఇక్క‌డే ఉన్నాడు. లాక్‌డౌన్ ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో ముంబై వెళ్లాడు. త‌న టీంతో క‌లిసి సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తున్నారు.