IPL-14 : ప్లేయర్లే కాదు.. అంపైర్లూ పోతున్నారు. అవసరమా అధ్యక్షా?..

IPL-14 మన దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొనసాగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు ప్లేయర్లు ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటూ ఉండగా ఇప్పుడు అంపైర్లు కూడా గుడ్ బై చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్-14 నుంచి ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్(ఢిల్లీ క్యాపిటల్స్); ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్(రాజస్థాన్ రాయల్స్); ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్స్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) వెళ్లిపోయారు. ఈ లిస్టులో తాజాగా ఇద్దరు అంపైర్లు చేరారు. మన దేశానికే చెందిన నితిన్ మీనన్, ఆస్ట్రేలియాకి చెందిన పాల్ రీఫెల్ ఐపీఎల్ కి టాటా చెప్పేశారు.

ఫ్యామిలీ.. ఫ్లైట్.. ఇంపార్టెంట్

ఐపీఎల్ ని వీడినవాళ్లంతా కరోనానే ప్రధాన కారణంగా చూపటం గమనార్హం. నితిన్ మీనన్ తల్లి, భార్య కొవిడ్ బారిన పడ్డారు. ఇతనికి చిన్న కుమారుడు ఉన్నాడు. దీంతో అతని బాగోగులు చూసుకోవటానికి ఆటకు ఫుల్ స్టాప్ పెట్టాడు. కాగా.. విమాన రాకపోకలపై తమ దేశం నిషేధం విధించటం వల్ల పాల్ రీఫెల్ సొంతం దేశానికి వెళ్లటానికి రెడీ అయ్యారు. ఐపీఎల్ ముగిశాక స్వదేశానికి పోవటానికి ఫ్లైట్లు ఉండవనే భయంతో ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇద్దరు అంపైర్లు ఆటకు దూరం కావటం వల్ల నష్టమేమీ లేదని, బ్యాకప్ అంపైర్లు చాలా మంది ఉన్నారని బీసీసీఐ ఆఫీసర్ ఒకరు ధీమా వ్యక్తం చేశారు.

విదేశాల నుంచి విమర్శలు

ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ సీజన్-14ని కొనసాగించి తీరతామన్న బీసీసీఐ ప్రకటనపై విదేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కూడా టోర్నీని కంటిన్యూ చేయటం ఘోరమైన తప్పిదమని ఇంగ్లండ్ మాజీ ఫుట్ బాలర్, కామెంటేటర్ గ్యారీ లినేకర్ తప్పుపట్టారు. మ్యాచ్ లో పరుగుల కన్నా ప్రాణాలే వేగంగా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాసులు కురిపించే ఈవెంట్లపై కామెంట్లు చేయకూడదనుకుంటా అంటూ గార్డియన్ పత్రిక సెటైర్ వేసింది. ఇండియా ఇలా మొండిగా వ్యవహరించటానికి బీసీసీఐ కార్యదర్శి జైషానే కారణమని ఆరోపించింది. ‘హ్యూమానిటీ కోసం ఆడుతున్నాం’ అని బీసీసీఐ.. ఫ్రాంఛైజీలకు ఇ-మెయిల్ పంపటాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఎద్దేవా చేసింది. ఇంగ్లండ్ ప్లేయర్లను రీకాల్ చేయాలనే ఒత్తిళ్లు వస్తున్నట్లు డైలీ మెయిల్ పేర్కొంది.

Advertisement