Ram Gopal Varma: ఏపీ నాయ‌కులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ‌ర్మ సూచ‌న‌..!

Ram Gopal Varma: ఏపీలో రాజ‌కీయం చాలా వాడివేడిగా సాగుతుంది. అక్టోబరు 19న సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పై టీడీపీ నేత పట్టాభి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో రాజకీయ దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు మంగళవారం సాయంత్రం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు.

Ram Gopal Varma

హెడ్ ఆఫీసు లోపలికి చొరబడి అద్దాలు పగులగొట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. అంతేకాదు టీడీపీ నేత పట్టాభి ఇంటిపైనా దాడులు పాల్పడ్డారు. ఈ ఘటనలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాయి.

టీడీపీ నేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట నిరసన చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఈ అంశంపై చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య చెలరేగిన మాటలు మంటలు పోటాపోటీగా నిరసనలకు దారి తీసాయి. ముట్టడి, పరస్పర ఘర్షణలతో ఏపీ అట్టుడుకేలా చేసింది. విధ్వంసం వెనుక వైసీపీ ఉందని ప్రతిపక్షం ఆరోపిస్తే.. టీడీపీ కవ్వింపు చర్యలే కారణమని అధికార పార్టీ విమర్శిస్తోంది.

ప్ర‌తి విష‌యంపై త‌న‌దైన శైలిలో స్పందించే రామ్ గోపాల్ వ‌ర్మ ఈ గొడ‌వ‌ల‌పై కూడా త‌న‌దైన శైలిలో కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్‌, కరాటే, కర్ర యుద్థం నేర్చుకోవాల్సి ఉంది’’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.