Ram Charan :ఆర్‌సీ15.. చరణ్ అమెరికాలో ఉన్నా చిత్రీకరణ ఆగలేదట
NQ Staff - March 9, 2023 / 06:40 PM IST

Ram Charan : మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు వేడుకలో పాల్గొనేందుకు కోసం రెడీ అవుతున్నాడు. మరో వైపు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది.
చరణ్ లేక పోయినా ఆయన లేని సన్నివేశాలని ప్రస్తుతం శంకర్ చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ కాంబినేషన్ లో సన్నివేశాలను వచ్చే నెలలో చిత్రీకరించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఖరీదైన పాటను దర్శకుడు శంకర్ విదేశాల్లో చిత్రీకరించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం హైదరాబాదులో భారీ సెట్ నిర్మించి పాటను చిత్రీకరించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో సినిమాను 2023 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని అంతా భావించారు.
కానీ ఇటీవల నిర్మాత దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాను 2024 సంక్రాంతి పండుగ విడుదల చేసేందుకు ఆలోచిస్తున్నట్లుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. కాస్త ఆలస్యమైనా కూడా కచ్చితంగా 2024 సంక్రాంతి విజేతగా రామ్ చరణ్ నిలవడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.