Ramaraju For Bheem: రామ‌రాజు ఫ‌ర్ భీమ్.. బుల్లితెర‌పై ఆర్ఆర్ఆర్ స్టార్స్ ర‌చ్చ‌

Ramaraju For Bheem: ఇటు వెండితెర అయిన అటు బుల్లితెర అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచ‌ల‌నాలు సృష్టిస్తుంటారు. బిగ్ బాస్ తొలి సీజన్‌కి హోస్ట్‌గా ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ రికార్డుల టీఆర్పీ సాధించారు. బిగ్ బాస్ మొదటి సీజన్ తరువాత మళ్లీ ఇంత వరకు బుల్లితెరపై కనిపించలేదు తారక్. కానీ చాలా రోజుల తరువాత మరో షోను అంగీకరించారు. అదే ఎవరు మీలో కోటీశ్వరుడు. ఈ షోకి సంబంధించి నిర్వాహ‌కులు భారీ ఏర్పాట్లే చేసిన కరోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

Ramaraju For Bheem

‘ఆట నాది గెలుపు మీది’ అంటూ నయా షో తో రాబోతున్నట్టుగా ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. జెమిని టీవీలో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం షూటింగ్‌లో పాల్గొన్నారని స‌మాచారం. అయితే ఇప్పుడు ఈ షోకి సంబంధించి ఆస‌క్తిక‌రమైన వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, కొద్ది సేప‌టి క్రితం మూవీ మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు.ఈ మేకింగ్ వీడియోతో అంచ‌నాల‌ను రెట్టింపు చేశాడు జ‌క్క‌న్న‌. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లుక్స్ అభిమానుల‌కు స‌రికొత్త వినోదాన్ని పంచాయి. ఈ వీడియోతో జ‌క్కన్న ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్ట‌గా, రానున్న రోజుల‌లో మ‌రిన్ని అప్‌డేట్స్ ఇస్తార‌ని స‌మాచారం.

ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి గెస్ట్‌గా హాజ‌రు కానున్నార‌ట‌. ఈ కార్యక్ర‌మంలో వీరిద్ద‌రు చేసే సంద‌డి ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదాన్ని అందిస్తుంద‌ని అంటున్నారు.అతి త్వ‌ర‌లో ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. వీరికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ,ఒలివియా మోరిష్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగ, సముద్రఖని, శ్రీయ,రాహుల్ రామకృష్ణ లతో పాటుగా హాలీవుడ్ నటులు అలిసన్ డూడీ , రే స్టీవెన్ సన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.