Rajinikanth: ఊహాగానాల‌కు తెర‌..ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌పై వ‌చ్చిన పూర్తి క్లారిటీ..!

Rajinikanth: ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం అమెరికాకు వెళ్లి వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ ఈ రోజు త‌న అభిమానుల‌తో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఫ్యాన్స్ తో మీటింగ్ అంటే ర‌జ‌నీకాంత్ త‌న రాజ‌కీయాల‌కి సంబందించి ఏదైన అప్‌డేట్ ఇస్తారేమో అని అనుకున్నారు. కాని ఆయ‌న ఫ్యూచ‌ర్‌లో కూడా రాజకీయాలు చేయ‌నని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అలానే రాజకీయ పార్టీగా చెప్తున్న రజినీ మక్కల్ మండ్రంను రద్దు చేస్తున్నట్లు రజనీకాంత్ నిర్ణయం తీసుకున్నాడు.

సోమవారం స‌మావేశం త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ర‌జ‌నీకాంత్ భవిష్య‌త్‌లోను రాజ‌కీయాల‌లోకి వ‌చ్చే ఆలోచ‌న లేద‌ని అన్నారు. రజినీ మక్కల్‌ మండ్రంను ఫ్యాన్స్‌ క్లబ్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. కరోనా, తమిళనాడు ఎన్నికలు, అమెరికా చెకప్‌ నేపథ్యంలో అభిమానులకు ఇంతకాలం దూరంగా ఉన్నానని, అందుకే ఈ రోజు వారితో కాసేపు స‌మావేశం అయ్యాన‌ని పేర్కొన్నాడు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ర‌జ‌నీకాంత్ త‌న అల్లుడు ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ఉంటుంద‌నే ప్రచారం న‌డుస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కు కొడుకులు లేరనే బాధ అప్పట్లో ఉండేదేమో కానీ ధనుష్ అల్లుడు అయిన తర్వాత పోయింది. ఎందుకంటే ఇప్పుడు అల్లుడైనా.. కొడుకైనా రెండూ ఈయనకు ఆయనే. తన అల్లుడి ఎదుగుదలను చూసి మురిసిపోతున్నాడు రజినీకాంత్. కేవలం నటుడిగానే కాకుండా మల్టీ టాలెంట్స్ తో రప్ఫాడిస్తున్నాడు ధనుష్. మరోవైపు నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ గానూ దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్నాడు. ఒకసారి కాదు రెండుసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు ధనుష్. దర్శకుడిగానూ పవర్ పాండి సినిమాతో సత్తా చూపించాడు.

మరోవైపు ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ తోనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అల్లుడు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు అనారోగ్యంతో బాధ పడుతున్న రజినీకాంత్.. కోలుకున్న తర్వాత అన్నాత్తే సినిమాను పూర్తి చేసాడు. శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. చిన్న ప్యాచ్ వర్కులు తప్ప అంతా అయిపోయింది. ఇది కాకుండా మరో రెండు సినిమాలకు కూడా రజినీ సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

అందులో ఓ సినిమాను ఆయన అల్లుడు ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. రజినీ 169వ సినిమాను దేసింగ్ పెరియస్వామి తెరకెక్కించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మరోవైపు రజినీకాంత్ 170వ సినిమాను ధనుష్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది.

‘పవర్ పాండి’ అనే సినిమాతో ధనుష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.. ఆ సినిమా మంచి విజయం కూడా సాధించింది. మధ్యలో రెండో సినిమాగా నాగార్జునతో కలిసి తానే నటిస్తూ ఓ మల్టీస్టారర్ అనౌన్స్ చేసాడు కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు రెండో సినిమాను మామతోనే చేయబోతున్నాడు. ఈ సినిమాను రజినీ కూతుళ్ళు సౌందర్య, ఐశ్వర్య నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.