RRR: ఆర్ఆర్ఆర్ రిలీజ్ విష‌యంలో స‌స్పెన్స్.. మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్న జ‌క్క‌న్న‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య ఆర్ఆర్ఆర్ సినిమాను పీరియడిక్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. చారిత్రాత్మక చిత్రం కాబట్టి ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ – మన్నెందొర కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ ప్రకటించిన ఈ సినిమా ఇంతవరకు పూర్తికాలేదు. ప్రస్తుతం ఓవైపు కరోనా మహమ్మారి వణికిస్తుండటం కారణంగా లాక్డౌన్ పడి షూటింగ్స్ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలకు మరింత ఆలస్యం అవుతూ వస్తోంది.

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వీలున్న‌ప్పుడల్లా షూటింగ్‌ను త్వ‌ర‌గ‌తిన పూర్తి చేశారు. ప‌గ‌లు రాత్రి తేడా లేకుండా ఈ సినిమా కోసం మేక‌ర్స్ చాలా క‌ష్ట ప‌డ్డారు. అయితే సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన‌ప్పుడ‌ల్లా ఏదో ఒక అవాంత‌రం రావ‌డం దాని వ‌ల‌న మూవీ షూటింగ్ వాయిదా ప‌డ‌డం జ‌రుగుతుంది. అయితే మ‌హ‌మ్మారి వ‌ల‌న అసలు పోస్ట్ ప్రొడక్షన్ కూడా కుదరటం లేదని ఆల్టర్నేట్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రేక్షకులలో రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. అందులోను ఇండియా వైడ్ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యేసరికి ఫ్యాన్స్ ఒత్తిడి కూడా అర్ధం అవుతోంది.

అక్టోబ‌ర్‌లో చిత్రం రావ‌డం ప‌క్కా అనుకునే స‌మ‌యానికి క‌రోనా సెకండ్ వేవ్ మొద‌లు కావ‌డంతో మూవీ రిలీజ్ పై అంద‌రిలో అనుమానాలు నెల‌కొన్నాయి. అయితే జక్క‌న్న న‌వంబ‌ర్ వ‌ర‌కు సినిమాను రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇంపార్టెంట్ వర్క్ అంతా.. అంటే గ్రాఫికల్ సీజీ షాట్స్ కు చెందిన వర్క్ న్యూజీలాండ్ లోని పిక్సల్ స్టూడియోస్ వారితో కలిసి కంప్లీట్ చేయాలనీ అనుకుంటున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన వ‌ర్క్ మొత్తం ఒకేసారి పూర్తి చేసి ఆ త‌ర్వాత రిలీజ్ డేట్ ప్ర‌క‌టించే యోచ‌న‌లో రాజ‌మౌళి ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈ ఏడాదే ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.