RAJAMOULI: స్టార్ హీరోలంద‌రితో రాజ‌మౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. చ‌రిత్ర తిర‌గ‌రాయడం ఖాయమంటున్న ఫ్యాన్స్

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చేసిన ప్రతి సినిమాను విజ‌య‌పథంలో న‌డిపించి ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమాతో రాజ‌మౌళి ఖ్యాతి ఖండాంత‌రాలు దాటింది. బాహుబ‌లి చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించి ఈ సినిమాపై దేశ విదేశాల‌లో ఆస‌క్తి నెల‌కొల్పాడు.బాలీవుడ్ రికార్డులు సైతం ఈ సినిమా చెరిపేసిందంటే బాహుబ‌లి హవా ఏ రేంజ్‌లో సాగింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతాన్ని ఎప్ప‌టికైన తెర‌కెక్కిస్తానంటున్నాడు.

మ‌హాభార‌తం కోసం 10 ఏళ్లు స‌మ‌యం ప‌డుతుంద‌ని, దానిని తెర‌కెక్కించాలంటే బాహుబ‌లి కన్నా ప‌దింత‌లు క‌ష్ట‌ప‌డాల‌ని జ‌క్క‌న్న పేర్కొన్నారు. రానున్న మూడేళ్ల‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ సినిమాలో అన్ని ఇండ‌స్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు భాగం అవుతార‌నే టాక్ న‌డుస్తుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఓ పాత్రని చేయించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘సైరా’ వంటి చారిత్రాత్మక సినిమాలో కూడా నటించారు. రాజ‌మౌళి తెర‌కెక్కించే మ‌హాభార‌తంలో చిరంజీవి పాత్ర పక్కా అనే టిక్ వినిపిస్తుంది. అయితే ‘మహాభారత’ ఘట్టాన్ని ఓ రేంజ్ లో తెరకెక్కించడానికి ఎక్కువ టైమ్ తీసుకోకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటర్ ఫేస్ టెక్నాలజీని వాడుకొని ఈ సినిమాను తీయాలనే ఆలోచన చేస్తున్నారట.

ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 450 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబ‌ర్ 13న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో రాజమౌళి ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను పూర్తి చేసి వెంట‌నే మ‌హాభార‌తాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌నుకుంటున్నాడు జ‌క్క‌న్న‌.