Raghurama Krishnam Raju : నేను ప‌వ‌న్ అభిమానిని.. ఎక్క‌డ నెగ్గాలో కాదు, త‌గ్గాలో తెలిసిన వాడిని: ర‌ఘురామ‌

Raghurama Krishnam Raju : గ‌త కొద్ది రోజులుగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నిత్యం వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు వైసీపీకి కొరకరాని కొయ్యలా మారిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా నిత్యం వైసీపీ ప్రభుత్వ, పార్టీ విధానాలను రఘురామ విమర్శిస్తూనే ఉన్నారు.

Raghurama Krishnam Raju talking about cases
Raghurama Krishnam Raju talking about cases

ముఖ్యంగా రెడ్లు, క్రిస్టియన్ సామాజికవర్గాలను టార్గెట్ చేసి గతంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై రాజ ద్రోహం కేసు నమోదవడం… సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. పోలీస్ కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ అప్పట్లో ఆరోపించారు. ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించి ఎట్టకేలకు బెయిల్ పొందగలిగారు. అప్పటి నుంచి రఘురామ ఢిల్లీ, హైదరాబాద్‌లకే పరిమితమయ్యారు.

తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు నలుగురు సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి రాగా.. సీఐడీ అధికారులు జారీ చేసిన నోటిసులపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. జనవరి 17వ తేదీన సీఐడీ విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని వెల్లడించారు.

గతంలో నన్ను అరెస్ట్ చేసే సమయంలో ఇంట్లో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారని, నా సిబ్బందిపై నాపై వ్యక్తిగత దాడి చేసినట్లు చెప్పారు రఘురామ కృష్ణరాజు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించానని చెప్పారు. సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాదియని, ఇదంతా చూసి ముఖ్యమంత్రి జగన్ ఆనందపడుతున్నాడని అన్నారు

ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చి వెళ్లిన అనంతరం బుధవారం రఘురామ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పవన్ కల్యాణ్ అభిమాని అని చెప్పారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.