Radhika Sarathkumar: మేం తెలుగు వాళ్లం.. మా నాన్నకి, ఎంజీఆర్ మధ్య గొడవను వెబ్ సిరీస్‌గా చేస్తానన్న రాధిక
NQ Staff - April 21, 2022 / 11:36 AM IST

Radhika Sarathkumar: అలనాటి అందాల తారలలో రాధిక పేరు తప్పక ఉంటుంది. చిరంజీవితో కలిసి రాధిక ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి.. ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది రాధిక. అంతే కాకుండా చాలాకాలం వరకు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. అయితే చాలాకాలంగా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్న రాధిక.. ఇటీవల ఓ కాంట్రవర్షియల్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Radhika Sarathkumar to Do Webseries on Her Father
వెండి తెరపై బుల్లి తెరపై తనదైన శైలి చూపించిన రాధిక, హీరోయిన్ గా ఎంత స్టార్ డమ్ అందుకున్నారో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అంతే ఇమేజ్ సాధించారు. అటు తమిళ్, ఇటు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ తో అదరగోడుతున్నారు. తాజాగా రాధిక ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు.
తాము తెలుగువాళ్లమేనని ఆమె రీసెంట్ గా స్పష్టం చేశారు. తమ సొంతూరు ఎక్కడో కూడా వెల్లడించారు. తన తండ్రి ఎంఆర్ రాధా సొంతూరు తిరుపతికి సమీపంలోనే వుందని ఆమె అన్నారు. అంతే కాదు తన తండ్రి తెలుగు మాట్లాడేవారని అయితే అది కొంచెం గమ్మత్తుగా ఉండేదన్నారు.
అయితే తను తెలుగు అమ్మాయినని కోలీవుడ్ వారు అనుకుంటారని, తెలుగులో మాత్రం తనను తమిళ అమ్మాయి అంటారని రాధిక నవ్వుతూ అన్నారు.కెరీర్ బిగినింగ్ లో తనకు తెలుగు వచ్చేది కాదన్నారు రాధిక. తెలుగు సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తరువాతే తాను తెలుగు నేర్చుకుని స్పష్టంగా మాట్లాడుతున్నా అన్నారు రాధిక.
రాధిక తండ్రి ఎం.ఆర్ రాధా కోలీవుడ్‌లో హీరోగానే కాదు విలన్‌గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయనకు, ప్రముఖ రాజకీయ నాయకుడు ఎంజీఆర్‌కు మధ్య ఏవో గొడవలు జరుగుతూ ఉండేవి. అప్పట్లో ఇదే కోలీవుడ్‌లో హాట్ టాపిక్. అంతే కాకుండా వీరిద్దరి మధ్య ఒకసారి కాల్పులు కూడా జరిగాయి. ఈ విషయంపై రాధిక స్పందించింది. తన తండ్రి వివాదాస్పదమైన వ్యక్తి అని తెలిసిన విషయమే అని, అప్పట్లో ఆయనకు, ఎంజీఆర్ ఏవో గొడవలు జరుగుతూ ఉండేవి అన్నారు రాధిక.
వారిద్దరి మధ్య జరిగిన కాల్పుల ఘటన గురించి అందరికీ తెలిసిందే అని మరోసారి దాని గురించి గుర్తుచేశారు. అయితే ఈ ఘటనను త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌గా తెరకెక్కించనుందట రాధిక. ప్రస్తుతం ఆ సిరీస్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, జులై నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది” అని తెలిపారు.