Pruthvi Raj: నాగ‌బాబుతో గొడ‌వ‌పై నోరు విప్పిన పృథ్వీరాజ్.. ఇప్పుడంతా ఒకటే అని కామెంట్

కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సంచలనం సృష్టించాడు. అయితే గత 2, 3 ఏళ్లుగా ఆయన తెరపై కనిపించడం మానేసాడు. అవకాశాలు కూడా దాదాపు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రాజకీయాల్లో బిజీ అయ్యాడు పృథ్వి రాజ్. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తో కలిసి నడిచాడు. ఆయన పార్టీకి ప్రచారం కూడా చేశాడు. ఆ సమయంలోనే ప్రత్యర్ధి పార్టీల జనసేనపై విమర్శనాస్త్రాలు సంధించాడు ఈయన. అక్కడితో ఊరుకోకుండా పవన్ కళ్యాణ్ ను కూడా ఒక ఆట ఆడుకున్నాడు.

జనసేన పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు సంధిస్తూ.. అది అసలు జగన్ కు పోటీ కాదు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో కూడా బాగానే వైరల్ అయ్యాయి. అందుకే ఆయనకు కొన్ని రోజుల పాటు అవకాశాలు రాలేదు. ముఖ్యంగా మెగా హీరోల సినిమాలలో కూడా బాయ్ కాట్ చేయాలి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో నానా యాగీ చేశారు. అన్నింటి కంటే ముఖ్యంగా నాగబాబుపై కూడా చాలా విమర్శలు చేశాడు పృథ్వీరాజ్. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే స్థాయిలో రచ్చ జరిగింది.

అయితే ఇవన్నీ అప్పుడే సమసిపోయాయి అని.. మెగా ఫ్యామిలీతో తాను ఎప్పుడు సన్నిహితంగానే ఉంటాను అని చెప్పుకొచ్చాడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్. తనకు మెగా కుటుంబంతో ఎప్పుడు గొడవలు లేవని.. అవన్నీ రాజకీయ పరంగా వచ్చిన విభేదాలు కాని వ్యక్తిగతంగా వచ్చినవి కాదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలు, రాజకీయాలు పూర్తిగా వేరు వేరు అని.. ఒకదానితో ఒకటి పోల్చి చూడకూడదు అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే నాగబాబుతో తన గొడవ కూడా టీ కప్పులో తుఫాను లాంటిది అంటూ కొట్టిపారేశాడు. ఈ మధ్య ఆయనతో కలిసి ఒక ఛానల్ లో నిర్వహించిన ప్రోగ్రాంలో కామెడీ కూడా చేశాడు పృథ్వి. ఇద్దరు కలిసి సరదాగా నవ్వుకున్నారు. పాత విషయాలు ఒక్కటి కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు అనిపించలేదు. ప్రస్తుతం మెగా అల్లుడు సినిమాలో నటిస్తున్నాను అని కన్ఫర్మ్ చేశాడు. వీటిని మరీ పెద్దది చేసి చూడాల్సిన అవసరం లేదని.. ఇవన్నీ అయిపోయిన గొడవలు అంటున్నాడు. మళ్లీ ఇప్పుడు అందరం కలిసి పోయామని చెప్పాడు పృథ్వి రాజ్.