Dil Raju: ఆన్‌లైన్ టిక్కెట్స్ గురించి మేమే అడిగాం, సినీ ప‌రిశ్ర‌మ‌ను వివాదాల‌లోకి లాగొద్దు: దిల్ రాజు

Dil Raju: గ‌త కొద్ది రోజులుగా ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్య‌వ‌హారంపై పెద్ద ర‌చ్చ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్ వ్యాఖ్య‌ల‌తో ఈ వ్య‌వ‌హారం మ‌రింత వేడెక్కింది. ప్రభుత్వమే పోర్టల్ నడిపిస్తే పన్ను ఎగ్గొట్టేందుకు ఛాన్సే లేదనేది ఒక వాదన. అయితే దీనిపై సినీవర్గాలు మాత్రం గుర్రుమీదున్నాయని సినీపెద్దలకు ఇది రుచించడం లేదని కథనాలొచ్చాయి.

Producer Dil Raju Comments After Met With AP Minister Perni Nani
Producer Dil Raju Comments After Met With AP Minister Perni Nani

సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ నిర్మాతలు బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్‌ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని చెప్పారు.

‘గతంలో మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి సీఎం జగన్‌ను కలిశాం. మా విజ్ఙప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా అనేది చాలా సున్నితమని, ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుంది. అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరుతున్నా. టికెట్లు ఆన్‌లైన్‌ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్‌లైన్‌ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది’ అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.

నిర్మాత సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. రాజకీయం వేరు.. సినిమా పరిశ్రమ వేరని స్పష్టం చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే.. తమకు సంబంధం లేదని ప్రకటించారు. థియేటర్‌లో 100 శాతం ఆక్యూపెన్సీ పెరగాలనేదే తమ ఉద్దేశమని, టికెట్లను ఆన్‌లైన్‌ చేయమని అడిగింది తామేనని గుర్తుచేశారు.