ASHWIN: అశ్విన్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం.. ప‌దిమందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని వెల్ల‌డించిన క్రికెట‌ర్ భార్య‌

ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో క‌రోనా విల‌య‌తాండం చేస్తుంది. కాస్త అజాగ్ర‌త్త‌గా ఉన్నా కూడా క‌రోనా బారిన ప‌డ‌డం ఖాయం. తాజాగా భారత్‌ ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్ అశ్విన్ ఇంట్లో క‌రోనా మ‌హ‌మ్మారి పంజా విప్పింది. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ప‌ది మందికి క‌రోనా సోకింద‌ట‌. ఈ విష‌యాన్ని అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌ తెలిపింది. శుక్రవారం అంద‌రికి టెస్టులు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టు త‌న ట్వీట్‌లో పేర్కొంది ప్రీతి.

ఒకే వారంలో ఆరుగురు పెద్ద‌వారికి, న‌లుగురు చిన్న పిల్ల‌ల‌కు పాజిటివ్ అని తేలింది. పిల్ల‌ల కార‌ణంగానే వైర‌స్ అంద‌రికి వ్యాపించి ఉంటుంది. కుటుంబ స‌భ్యుల‌మంద‌రం వేర్వేరు ఇళ్ల‌ల్లో , ఆసుప‌త్రుల‌లో చేర‌డంతో గ‌త‌వారం ఓ పీడ‌క‌ల‌లా గ‌డిచింది. ప్ర‌తి ఒక్క‌రు టీకా తీసుకొని, ఇంటి ప‌ట్టున ఉండండి అంటూ ప్రీతి త‌న ట్వీట్‌లో పేర్కొంది. కాగా, అశ్విన్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఐపీఎల్ ఆడుతుండ‌గా, గ‌త వారం సీజ‌న్ నుండి త‌ప్పుకున్నారు. త‌న కుటుంబం ప్రాణాంత‌క వైర‌స్ నుండి పోరాడుతున్న నేప‌థ్యంలో అశ్విన్ , తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement