Prakash Raj: మా లెక్క‌లు తేల్చిన ప్ర‌కాశ్ రాజ్.. ఇళ‌య‌రాజాతో క‌చేరి పెట్టిస్తానంటూ కామెంట్స్

Prakash Raj: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (‘మా’) ఎన్నికలు అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నుండ‌గా, దీనికి సంబంధించి ప్ర‌కాశ్ రాజ్ జోరుగానే ప్ర‌చారం చేస్తున్నారు. ‘మా’ ఎన్నికలలో గెలిచిన 6 నెలల్లో రూ. 10 కోట్ల ‘మా’ వెల్ఫేర్ ఫండ్‌ని క్రియేట్ చేయడమే తన ధ్యేయంగా ప్రకాశ్ రాజ్ తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ‘మా’ ఎన్నికలలో సిని‘మా’ బిడ్డలం ప్యానల్‌ నుంచి అధ్యక్షుడిగా ప్రకాశ్‌ రాజ్‌ బరిలోకి దిగుతున్నారు.

Prakash Raj Recent Speech before Maa Elections
Prakash Raj Recent Speech before Maa Elections

మా మెంబ‌ర్స్‌తో ఏర్పాటైన స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న ‘మా’ కోసం మేస్ట్రో ఇళయరాజాతో కన్సర్ట్ కూడా చేయిస్తానని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) మసకబారడానికి అందులో ఉన్న 900మంది సభ్యులు కారణం కాదని, మనం ఎన్నుకునే 30మందే కారణమని సినీ నటుడు, మా ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. నేను ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. మనిషి ఎదిగిన ఎత్తును బట్టి అతడిని కొలవకూడదు. వాడు ఎంతమందిని ఎదగనిచ్చాడో దాన్ని బట్టి కొలవాలి. అది నా తల్లి నాకు నేర్పిన పాఠం.

‘మా’ను ఓ ఛారిటీ అసోసియేషన్‌గా మార్చేశారు. చనిపోయినప్పుడు డబ్బులు ఇవ్వడం, రేషన్‌ ఇప్పించడం, వేషాలు దక్కేలా చూడటం.. ఇది కాదు ‘మా’ అసోసియేషన్‌. ఇది ఆర్టిస్టులను బలపరిచే అసోసియేషన్‌గా ఉండాలి. ఆర్టిస్ట్‌కు కష్టం లేకుండా చేసేలా అసోసియేషన్‌ పనిచేయాలి. అసలు సమస్యను పరిష్కరించాలంటే ముందు దానిపై అవగాహన ఉండాలి’’. ‘‘మా’ అసోసియేషన్‌లో 900మంది సభ్యులున్నారని అందరూ అంటున్నారు.

కాని అది నిజం కాదు ఇందులో సుమారు 150 మంది యాక్టివ్ మెంబ‌ర్స్ కాదు. జెనీలియా మాజీ సీఎం కొడుకును వివాహం చేసుకుని వెళ్లిపోయారు. ఆమె యాక్టివ్‌ మెంబర్‌కారు. అలాంటి వాళ్లను తీసేస్తే, 750మంది మాత్రమే ఉన్నాం. అందులో 147మంది స్థానికులు కాదు. చెన్నై, బెంగళూరు, కేరళ నుంచి వచ్చి తమ షూటింగ్‌ పూర్తి చేసుకుని వెళ్లిపోతారు. వాళ్లకు అమౌంట్‌, బస, ఫ్లైట్‌ టికెట్స్‌కు డబ్బులు కూడా బాగానే ఇస్తారు.

ఇక ఉన్నది 600మంది మాత్రమే! అందులో కొందరు యువ కథానాయకులు, పెద్ద పెద్ద నటులు ఓటింగ్‌కు రారు. వాళ్లకు అవసరం లేదు. మిగిలింది 450మంది. అందులో కూడా 200మంది బాగానే ఉన్నారు. ఇంకా ఆదుకోవాల్సింది 250మందిని మాత్రమే. ఆదుకోలేమా! అందులో 40 రంగస్థల కళాకారులు ఉన్నారు. వాళ్లకు సినిమా పాలిటిక్స్‌ తెలియవు. ఎక్కడకు వెళ్లాలో తెలియదు. కొంచెం కౌన్సిలింగ్‌ ఇస్తే, సినిమా కెమెరాకు అనుగుణంగా చక్కగా నటిస్తారు.

నేను ఊరికినే ఎన్నికలకు రాలేదు. ఆరు నెలల పాటు ఈ హోం వర్క్‌ చేసుకుని వచ్చా! ‘నాటక కళాకారులకు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా! ఎందుకు అందించటం లేదు’ అని నేను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారిని అడిగితే, ‘మమ్మల్ని ఎవరూ అడగలేదు కదా’ అని అన్నారు. మంచి చేయాలనుకుంటున్నారు కానీ, ఎలా చేయాలో ఎవరికీ తెలియదు.

మా అధ్యక్షుడిగా ఎన్నికైన మూడు నెలల్లో ‘మా’ అసోసియేషన్‌ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరికీ హెల్త్‌కార్డు ఉంటుంది. ‘నేను చేశాను’ అంటూ వచ్చే వాడు ఏమీ చేయడు. కానీ నేను, 10మందితో చేయిస్తాను. 10 మందితో కలిసి చేస్తాను. పేద కళాకారుల పిల్లలను దత్తత తీసుకుని వారి చదువుకు అయ్యే ఖర్చు భరించేలా హీరోలను ప్రోత్సహిస్తా. కొవిడ్‌ సమయంలో ‘నవరస’ ప్రాజెక్టు చేసి పేద కళాకారులను ఆదుకున్నాం.

తెలుగులోనూ సాయం అడిగితే చేసేందుకు త్రివిక్రమ్‌, పూరి జగన్నాథ్‌, కృష్ణవంశీ, క్రిష్‌, నాని, శర్వానంద్‌ ఇలా అందరూ ముందుకు వస్తానని అన్నారు. ‘మా’ అసోసియేషన్‌లో బాగా ఉన్న 200మందితో పని చేయించడానికి వస్తున్నాం. ఇక నుంచి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో నలుగురు కో-ఆర్డినేటర్స్‌ ఉంటారు. ప్యానెల్‌లో ఉన్న 26మందికీ 26 ఫోన్‌ నెంబర్లు ఉంటాయి. ఎంత పెద్ద హీరో, హీరోయిన్‌ అయినా, వాళ్లకు నేను అధ్యక్షుడిని, వాళ్లు ‘మా’లో సభ్యులు’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.