ప్రదీప్ సినిమాకి మోక్షం ” 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ” రిలీజ్ డేట్ ఫిక్స్ ..!
Vedha - January 11, 2021 / 03:44 PM IST

ప్రదీప్ యాంకర్ గా బుల్లితెర మీద విపరీతమైన పాపులారిటీని దక్కించుకున్నాడు. ఒక చిన్న ప్రోగ్రాం తో బుల్లితెర మీద సందడి మొదలు పెట్టిన ప్రదీప్ ఆ తర్వాత పలు టీవీ షోస్ కి యాంకర్ గా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అన్న టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించి టాలీవుడ్ సినీ తారలని ఈ టాక్ షో ద్వారా ఇంటర్వ్యూస్ చేసి ఎంటర్‌టైన్ చేశాడు. ఇక ఢీ అన్న డాన్స్ షో లో యాంకర్ గా ప్రదీప్ కి ఉన్న క్రేజ్ అసాధారణం.
అయితే ఇప్పటికే పలువురు యాంకర్స్ బిగ్ స్క్రీన్ మీద హీరోలుగా.. హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సస్ అవుతున్నారు. వారిలో రష్మీ, అనసూయ మంచి క్రేజ్ ని సంపాదించుకోగా .. మేల్ యాంకర్స్ లో రవి హీరోగా ఒక సినిమా చేశాడు. అలాగే సుధీర్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రదీప్ కూడా హీరోగా మారి ఒక సినిమా చేశాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా ల్యాబ్ లోనే ఉండిపోయింది. కాగా థియేటర్స్ ఓపెన్ అయ్యాక మెల్లగా ఒక్కో సినిమా మంచి డేట్ చూసుకొని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకి కూడా జనవరి 29 న రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర ‘ఆర్య’, ఆర్య 2,’ ‘1.. నేనొక్కడినే’ సినిమాలకి అసోసియేట్ గా పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రదీప్ కి జంటగా అమృతా అయ్యర్ నటించింది. అంతేకాదు ఈ సినిమాలో ప్రదీప్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం అన్న సాంగ్ విపరీతంగా ఆకట్టుకొని ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తుండటం విశేషం.