Pradeep Machiraju: వివాదంపై ప్ర‌దీప్ స్పంద‌న ఇదే..!

Pradeep Machiraju: తెలుగు బుల్లితెర‌పై తిరుగు లేని ఇమేజ్ సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్ మ‌రోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే ప్రసారమైన ఓ షో లో ప్రదీప్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి తీవ్రంగా మండిపడింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ‘విశాఖపట్నం’ అంటూ ఓ వ్యాఖ్య చేశాడు. దీంతో ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pradeep Machiraju:
Pradeep Machiraju:

కోర్టులో ఉన్న విష‌యంపై ఆయ‌న త‌న అభిప్రాయం ఎలా చెబుతాడు. ఈ విష‌యంపై ప్ర‌దీప్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే తన ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాస రావు తెలిపాడు.

ప్రదీప్ వ్యాఖ్యలు ప్రజలు, రైతుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదీప్ స్పందించకపోతే బుద్ధి చెప్తామని అన్నారు శ్రీనివాస‌రావు. వారు వార్నింగ్ ఇచ్చిన కొద్ది నిమిషాల‌లోనే యాంక‌ర్ ప్ర‌దీప్ ఓ వీడియో విడుద‌ల చేశాడు. ఎవరినీ కించపరచడానికి కానీ, అవమానించడానికి కానీ తాను ప్రయత్నించలేదని.. అసలు అది తన ఉద్దేశం కాదు అంటూ వీడియో విడుదల చేశాడు.

అనుకోకుండా జరిగింది కానీ ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ స్పష్టం చేశాడు. తన లక్ష్యం ప్రేక్షకులకు వినోదం అందించడమే కానీ వాళ్లను అవమానపరచడం, మనోభావాలు దెబ్బ తీయడం కాదని యాంకర్ ప్రదీప్ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు. తన వల్ల జరిగిన తప్పుకు తానే క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశాడు.

యాంక‌రింగ్ రంగంలో దూసుకుపోతున్న ప్ర‌దీప్ మాచిరాజు ఇప్పుడు బిజ‌యెస్ట్ యాంక‌ర్ అయ్యాడు. హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ప్ర‌దీప్ ఈ సినిమాతో పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాడు. ఇప్పుడు మంచి క‌థ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవ‌ల క‌రోనాతో త‌న తండ్రిని కోల్పోయాడు ప్రదీప్. ప్ర‌స్తుతం ఆ బాధ‌లోనే ఉన్నాడు.