Pradeep: క‌ష్టాల్లో ప్ర‌దీప్.. క్ష‌మాప‌ణలు చెప్పి తీరాల‌ని డిమాండ్

Pradeep: టీవీ, సినిమా రంగానికి చెందిన వారికి వివాదాలు కొత్తేమి కాదు . వారు ఎప్ప‌డు, ఎక్క‌డ ఏం మాట్లాడిన కూడా అవి వివాదంగానే మారుతుంటాయి. అందుకే చాలా మంది సెల‌బ్స్ బ‌య‌ట మాట్లాడిన‌ప్పుడు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడుతుంటారు. అయితే ఒక్కోసారి తెలిసి తెలియ‌ని వ్యాఖ్య‌ల వ‌ల‌న లేనిపోని ఇబ్బందులు ఎద‌ర్కొంటూ ఉంటారు. తాజాగా యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు చేసిన కామెంట్ అత‌న్ని క‌ష్టాల్లోకి నెట్టింది.

యాంక‌రింగ్ రంగంలో దూసుకుపోతున్న ప్ర‌దీప్ మాచిరాజు ఇప్పుడు బిజ‌యెస్ట్ యాంక‌ర్ అయ్యాడు. హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ప్ర‌దీప్ ఈ సినిమాతో పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాడు. ఇప్పుడు మంచి క‌థ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవ‌ల క‌రోనాతో త‌న తండ్రిని కోల్పోయాడు ప్రదీప్. ప్ర‌స్తుతం ఆ బాధ‌లోనే ఉన్నాడు.

వివాదాల‌కు చాలా దూరంగా ఉంటారు ప్ర‌దీప్. టీవీ వ్యాఖ్యతగా చాలా కూల్‌గా జ‌ర్నీ సాగిస్తూ వ‌స్తున్నారు. అయితే ఓసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా పట్టుబడి వివాదంలో చిక్కుకున్నాడు. ఆ త‌ర్వాత ఓ మహిళ ప్ర‌దీప్‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేయ‌గా, ఆయ‌న పేరు హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ప్ర‌దీప్ త‌న‌ని వాడుకున్నాడ‌ని దారుణంగా కామెంట్స్ చేసింది. త‌ర్వాత ఆ మ‌హిళే అవ‌న్నీ అబద్దాలు అని చెప్పుకొచ్చింది. ఇండ‌స్ట్రీలో ప్ర‌దీప్ అంద‌రితో క‌లుపుగోలుగా ఉంటార‌ని పెద్ద‌గా వివాదాల జోలికి పోర‌ని అంటుంటారు.

అయితే ఇటీవలే ప్రసారమైన ఓ షో లో ప్రదీప్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అతనిపై తీవ్రంగా మండిపడింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ‘విశాఖపట్నం’ అంటూ ఓ వ్యాఖ్య చేశాడు. దీంతో ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న విష‌యంపై ఆయ‌న త‌న అభిప్రాయం ఎలా చెబుతాడు. ఈ విష‌యంపై ప్ర‌దీప్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే తన ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాస రావు తెలిపాడు.

ప్రదీప్ వ్యాఖ్యలు ప్రజలు, రైతుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదీప్ స్పందించకపోతే బుద్ధి చెప్తామని అన్నారు శ్రీనివాస‌రావు. మ‌రి ఈ వివాదంపై ప్ర‌దీప్ ఏమైన స్పందిస్తారా అన్న‌ది చూడాలి.