PRABHAS: ముంబైలో ఖ‌రీదైన ఇల్లు కోసం వెతుకుతున్న ప్ర‌భాస్‌.. కొంప‌దీసి అక్క‌డే సెటిల్ అవుతాడా ఏంటి?

PRABHAS డార్లింగ్ ప్ర‌భాస్ ప్ర‌తి రోజు ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఇప్పుడు చేయ‌బోతున్న సినిమాల‌ను కూడా పాన్ ఇండియా లెవ‌ల్‌లోనే రూపొందేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప‌లు భాష‌ల‌లో విడుదల చేయ‌బోతున్నారు. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇక ఛ‌త్ర‌ప‌తి లాంటి సినిమాను ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు ప్ర‌భాస్. స‌లార్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం క‌న్న‌డ హిట్ ఉగ్రంకు రీమేక్ అని అంటున్నారు.

స‌లార్ చిత్రంలో గ్యాంగ్ లీడర్‌గా కనిపించబోయే ప్రభాస్‌కు రివేంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ముంబై మాఫియాను కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇందులో బాలీవుడ్ నటులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నారు. మరోవైపు 3డీ యానిమేష‌న్ చిత్రంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ అనే చిత్రం చేస్తున్నాడు. పౌరాణిక ఇతిహాసాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం. సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా క‌నిపించ‌నున్నాడు.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలోను ప్ర‌భాస్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. ఇందులో దీపికా ప‌దుకొణే క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా, అమితాబ్ బచ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా స‌మ్మ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.ఇవే కాక రానున్న రోజుల‌లో ప‌లు హిందీ సినిమాలు కూడా చేయాల‌నుకుంటున్నాడ‌ట ప్ర‌భాస్. ఈ క్ర‌మంలో ముంబైలో కాస్ట్‌లీ ఫ్లాట్ కోసం వెతుకులాట మొద‌లు పెట్టాడ‌ని స‌మాచారం. టీ సిరీస్ అధినేత కూడా ప్ర‌భాస్ కోసం మంచి ఇల్లు వెతికే పనిలో ఉన్నాడ‌ట‌. ముంబైలో ఇల్లు కొంటున్నాడంటే ఇక అక్క‌డే సెటిల్ అయి వ‌రుస హిందీ చిత్రాలు చేస్తాడా ఏంటి అని ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు.

Advertisement