SIRI VENNELA : సిరివెన్నెల మ‌ర‌ణం న‌న్ను బాధించింది.. ప్ర‌ధాని మోదీ సంతాపం

SIRI VENNELA : టాలీవుడ్‏లో తీవ్ర విషాదం నెలకొంది. వెండితెర పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సిరివెన్నెలతో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

PM Modi Condoles for Siri Vennela death
PM Modi Condoles for Siri Vennela death

ప్ర‌ధాని మోదీకూడా సిరివెన్నెల‌కు సంతాపం తెలియ‌జేసారు. . అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.. అంటూ తెలుగులో ట్వీట్‌ చేశారు ప్రధాని మోడీ.

సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి సారిగా మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. డైరెక్టర్ కూచిపూడి వెంకట్‌తో చివరకి సారిగా ఫోన్‌లో మాట్లాడారు. మణికొండలో కూతురు ఇంట్లో ఉన్నట్టు చెప్పారు. వాసు సినిమా రాయాల్సి ఉంది.. కానీ రెండు నెలలు రాయలేనన్నారు.

డిశంబర్ నెల అంతా పోస్ట్ ఆపరేషన్ రెస్ట్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. మళ్లీ ఆరోగ్యంగా తిరిగొస్తాననే నమ్మకం కావొచ్చు.. తన ఆరోగ్య పరిస్థితిపై నవ్వుతూ సరదాగానే మాట్లాడారు. కానీ అంతలోనే ఆయన వెన్నెలలో కలిసిపోయారు.

సిరివెన్నెల మృతికి సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా సంతాపం తెలిపారు. ఈరోజు ఆయ‌న అంత్య‌క్రియ‌లు మహా ప్ర‌స్థానంలో జ‌ర‌గ‌నున్నాయి.