Pawan Kalyan: క్లాసీ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ సినిమా.. ఇది నిజ‌మేనా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికలు వచ్చే వరకూ ఆయనకు పెద్దగా పని కూడా లేదు. మధ్యలో అప్పుడప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటూ.. ఎక్కువ సమయం సినిమాలకు కేటాయిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ ఏడాది ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవర్ స్టార్.

ప్రస్తుతం సెట్స్ పై క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు.. సాగర్ కె చంద్ర సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు హరీష్ శంకర్ కూడా లైన్ లో ఉన్నాడు. ఈయన సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ బరిలో సినిమాలు దింపాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం నెలకు పది రోజులు డేట్స్ ఇస్తున్నాడు పవర్ స్టార్.

ఇదిలా ఉంటే మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా పవన్ కళ్యాణ్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. అందులో సురేందర్ రెడ్డి అందరి కంటే ముందున్నాడు. వీళ్లందరినీ కాసేపు పక్కన పెడితే ఒక అనూహ్యమైన దర్శకుడు పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడు ఆయన అభిమాని కూడా. ఇప్పటికే ఆయన దర్శకుడిగా ప్ర‌స్థానం మొద‌లు పెట్టి 20 ఏళ్లు అవుతుంది.

ఈ రెండు దశాబ్దాల లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ సదరు దర్శకుడు ఎవరో కాదు శేఖర్ కమ్ముల. తను రాసుకునే ప్రతి కథలో పవన్ కళ్యాణ్ ను ఊహించుకుంటారు శేఖర్. అప్పట్లో లీడర్ సినిమాను పవన్ తోనే చేయాలనుకున్నాడు. అలాగే ఫిదా కథ కూడా పవన్ కళ్యాణ్ కు చెప్పాలని ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తన కోసం ఒక మంచి కథ సిద్ధం చేయాలని ఈ దర్శకుడికి పవన్ కాంపౌండ్ నుంచి సమాచారం వెళ్ళింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ఏదేమైనా శేఖర్ కమ్ముల, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే వినడానికి కూడా విచిత్రంగా ఉంది. ఇక నిజంగా ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే అంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉండదు.

శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కాని క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. లాక్ డౌన్ త‌ర్వాత చిత్రాన్ని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.