PAWAN KALYAN: పవ‌న్ క‌ళ్యాణ్‌కు క‌రోనా పాజిటివ్‌.. కొన‌సాగుతున్న వైద్య చికిత్స

సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఈ నెల 3న తిరుప‌తిలో జ‌రిగిన పాద‌యాత్ర‌, బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని హైద‌రాబాద్‌కు చేరుకున్న ప‌వ‌న్‌కు కాస్త న‌ల‌త‌గా ఉన్న‌ట్టు క‌నిపించారు. డాక్ట‌ర్స్ సూచ‌న మేర‌కు కరోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఫ‌లితాలు నెగెటివ్‌గా వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ వైద్యుల సూచ‌న మేర‌కు త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అప్ప‌టి నుండి కొద్దిపాటి జ్వ‌రం, ఒళ్లు నొప్పుల‌తో ఇబ్బంది ప‌డ్డారు. రెండు రోజుల కింద‌ట మ‌రోసారి కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, పాజిటివ్ ఫ‌లితం వ‌చ్చింది.దీంతో ఖ‌మ్మంకు చెందిన వైర‌ల్ వ్యాధుల నివార‌ణ నిపుణులు, కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ తండిళ్ల సుమ‌న్ హైద‌రాబాద్‌కు వ‌చ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చికిత్స అందించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అవ‌స‌ర‌మైన చికిత్స‌లు అన్ని చేయించారు. అయితే ఊపిరితిత్తుల‌లో కొద్దిగా నిమ్ము చేర‌డంతో యాంటివైర‌ల్ మందుల‌తో చికిత్స చేయిస్తున్నారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆక్సిజ‌న్ కూడా అందిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యం గురించి చిరంజీవి, సురేఖ‌, రామ్ చ‌ర‌ణ్‌,ఉపాస‌న ఎప్ప‌టిక‌ప్పుడు ఆరాలు తీస్తున్నారు. అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌న్ని చేయిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే ఆయ‌న‌కు చికిత్స జ‌రుగుతుంది. అపోలో నుండి ఓ వైద్య బృందం కూడా వ‌చ్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రీక్షించింది. అపోలో ఆసుప‌త్రికి చెందిన డాక్ట‌ర్ శ్యామ్, డాక్ట‌ర్ సుబ్బారెడ్డి ప‌వ‌న్ ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. జ్వ‌రం, ఊపిరితిత్తుల‌లోని నిమ్ము ,ఒళ్లు నొప్పులు త‌గ్గ‌డానికి మందులు ఇస్తున్నారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం నిల‌క‌డగానే ఉంద‌ని త్వ‌ర‌లో సంపూర్ణ ఆరోగ్యంతో ప్ర‌జ‌లు, అభిమానుల ముందుకు వ‌స్తాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

గ‌త వారం రోజులుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట డా.సుమ‌న్ ఉండి త‌గిన వైద్య సేవ‌లు అందిస్తున్నారు. నిర్మాత నాగవంశీ కూడా ప‌వ‌న్ వెన్నంటే ఉండి ఆయ‌న‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తూ, వైద్య సేవ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. కాగా, ఈ రోజు ఉద‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆసుప‌త్రికి వెళ్లిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కాగా, అది చూసి అభిమానులు కంగారు ప‌డ్డారు. ఇప్పుడు ప‌వ‌న్‌కు పాజిటివ్ అని తెలిసి పూజ‌లు చేస్తున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్ధిస్తున్నారు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ టీంలో నివేదా థామ‌స్, దిల్ రాజు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Advertisement