Padutha Theeyaga: పాడుతా తీయ‌గా మ‌ళ్లీ మొద‌లు కానుందా.. ఇప్పుడు హోస్ట్ ఎవ‌రో తెలుసా?

Padutha Theeyaga: బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌య్యే పాట‌ల కార్య‌క్ర‌మాల‌లో చాలా పాపుల‌ర్ షో పాడుతా తీయ‌గా. కొన్ని ద‌శాబ్దాల నుండి స‌క్సెస్ ఫుల్‌గా న‌డిపిస్తూ వ‌చ్చారు గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. రెండు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరించిన ఈ కార్య‌క్ర‌మం ద్వారా యువ గాయ‌నీ గాయ‌కులు వెలుగులోకి వ‌చ్చారు. ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ సింగ‌ర్స్‌గా కొన‌సాగుతున్న కొంద‌రు సింగ‌ర్స్ ఈ కార్య‌క్ర‌మం నుండి వెలుగులోకి వ‌చ్చి మంచి స్థాయిని చేరుకున్నారు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు పాడుతా తీయ‌గా కార్య‌క్ర‌మంలో పాటలు పాడి శ్రోత‌ల‌ను ఎంత‌గానో అల‌రించారు. అయితే బాలు అకాల మ‌ర‌ణం త‌ర్వాత ఈ కార్య‌క్ర‌మంపై అంద‌రిలో సందేహాలు నెల‌కొన్నాయి.

Padutha Theeyaga

పాడుతా తీయ‌గా కార్య‌క్ర‌మంలో బాలు చెప్పే కబుర్లు హుందాతనంతో కూడిన ఆయన జడ్జిమెంట్ షోకే వన్నె తెచ్చాయి. అయితే ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కార్య‌క్ర‌మం ఇక ఉండ‌ద‌ని అంద‌రు భావిస్తున్న నేపథ్యంలో షోకు సంబంధించిన ఓ వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. బాలు లేని పాడుతా తీయ‌గా ఇక లేద‌ని ఆయ‌న స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేయ‌లేర‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కాని బాలు తనయుడు ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో పాడుతా తీయగాను నడిపించాలని నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. బాలు కొడుకు అంటే ప్రేక్షకుల్లో ఒక సానుకూల భావం ఉంటుందని.. స్థాయి పరంగా తండ్రికి స‌రితూగ‌క‌పోయిన‌, ఆయ‌న వార‌సుడైతే బాలు జ్ఞాప‌కాలు , ఇత‌ర విష‌యాలు చెబుతూ అంద‌రిని అలరిస్తార‌ని రామోజీరావు భావించార‌ట‌.

Padutha Theeyaga

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న పాడుతా తీయ‌గా కార్య‌క్ర‌మంలో ఎస్పీ చ‌ర‌ణ్‌తో పాటు ర‌చ‌యిత చంద్ర‌బోస్, సింగ‌ర్ సునీత కూడా హోస్ట్‌గా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే షోకి సంబంధించి షూటింగ్ జ‌రిగింద‌ని, త్వ‌ర‌లో మ‌రికొన్ని ఎపిసోడ్స్ పూర్తి చేసి ఆ త‌ర్వాత టెలికాస్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. శుక్రవారం బాలు జ‌యంతి సంద‌ర్భంగా చిరంజీవి, త్రివిక్ర‌మ్, కోదండ‌రాం, దేవి శ్రీ ప్ర‌సాద్, రాఘేవంద్ర‌రావు, బాల‌కృష్ణ ఇలా ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది ప్ర‌ముఖులు ఆయ‌న జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నాడు. ఘంట‌సాల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా దగ్గ‌రైన బాల సుబ్ర‌హ్మ‌ణ్యం 40 వేల‌కు పైగా పాట‌లు ప‌డి అన్ని భాష‌ల వారిని ఎంతగానో అల‌రించారు.

Padutha Theeyaga