రికార్డులు రారాజుగా భీమ్.. టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ కావ‌డంతో ఆనందంలో ఫ్యాన్స్

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ అనే ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా అల‌రించ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భీమ్ ఫ‌ర్ రామ‌రాజు అనే వీడియో విడుద‌ల కాగా, కొమురం భీం జ‌యంతికి రామ‌రాజు ఫ‌ర్ భీం అనే వీడియో విడుద‌ల చేశారు. రెండు వీడియోల‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

రామ్ చ‌ర‌ణ్ టీజ‌ర్ కోసం ఎన్టీఆర్ త‌న గళాన్ని అందించగా, ఎన్టీఆర్ టీజ‌ర్‌కు చ‌ర‌ణ్ త‌న వాయిస్ అందించారు. ఈ రెండు టీజ‌ర్స్ ప్రేక్ష‌కుల‌ని ఎక్కువ‌గానే అల‌రించిన‌ప్ప‌టికీ, రామ‌రాజు ఫ‌ర్ భీం అనే వీడియో మాత్రం రికార్డులు తిర‌గ‌రాస్తుంది. అక్టోబ‌ర్ 22న విడుద‌లైన ఈ మూవీ టీజ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ల‌క్ష‌ల‌కు పైగా కామెంట్స్‌ని రాబ‌ట్టింది. ఇంత భారీగా కామెంట్స్ ద‌క్కించుకున్న టీజ‌ర్ టాలీవుడ్‌లో ఇంత‌వ‌ర‌కు రాలేదు. మరో వైపుఈ వీడియో ఇప్ప‌టి వ‌ర‌కు 3 కోట్ల‌కి పైగా వ్యూస్ సంపాదించ‌డంతో పాటు 11 ల‌క్ష‌ల లైక్స్‌ని రాబ‌ట్టింది.

చ‌రిత్ర‌కు కాస్త కాల్ప‌నిక‌థ జోడించి రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్‌కు జోడిగా అలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా, ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియో మోరిస్ న‌టిస్తుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ జ‌న‌వ‌రి నుండి మొద‌లు కానున్నాయి. బాహుబ‌లిని మించి ఈ సినిమా రికార్డులు సాధించేలా జ‌క్క‌న్న చెక్కుతున్నాడు. అయితే రాజ‌మౌళి సినిమాలు అంటే రికార్డులే కాదు వివాదాలు కూడా ఉంటాయి. రానున్న రోజుల‌లో ఈ చిత్రానికి సంబంధించి ఎన్ని వివాదాలు చెల‌రేగుతాయో చూడాలి.

 

Advertisement
Advertisement