NTR: బింబిసార కోసం అన్న‌కు స‌పోర్ట్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్

NTR: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్న హీరోల‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఒక‌రు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ చెప్పుకోద‌గ్గ విజ‌యాలు ద‌క్క‌డం లేదు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మొత్తం కెరియ‌ర్‌లో ప‌టాస్, 118 సినిమాలు మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ విజ‌యాలు సాధించాయి. కళ్యాణ్ రామ్ చివరిగా నటించిన ‘ఎంతమంచి వాడవురా’ సినిమా కూడా ప్లాప్ గా కావడం నిరాశపరిచే విషయం. మంచి హిట్ త‌ప్ప‌ని స‌రిగా కొట్టాల‌ని భావించిన క‌ళ్యాణ్ రామ్ లాక్‌డౌన్ లో ప‌లు క‌థ‌ల‌ని విని చివ‌రికి వశిష్ట మల్లిడి డెబ్యూ డైరెక్టర్ స్టోరీని ఓకే చేసాడు.

సోషియో ఫాంటసీ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాకు సంబంధించి ఇటీవ‌ల‌ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో క‌ళ్యాణ్ రామ్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది ‘బింబిసార’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్‌తో రూపొంద‌నున్న చిత్రంలో కళ్యాణ్ రామ్ నెవర్ బిఫోర్ లుక్కులో దర్శనమివ్వ‌నున్నాడు. అయితే బింబిసార అనేది టైం ట్రావెలింగ్ జానర్ కాబట్టి ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమాను పోలి ఉండబోతుందని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మ‌ల్టీ స్టార‌ర్ కాక‌పోయిన అన్న కోసం త‌మ్ముడు సాయం చేయ‌నున్నాడ‌నే టాక్ న‌డుస్తుంది.

‘బింబిసార’ మూవీలో ఎన్టీఆర్ కూడా భాగస్వామి కాబోతున్నార‌నే వార్త‌లు తాజాగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కీల‌క‌మైన పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించి ప్రేక్ష‌కుల‌ని క‌నువిందు చేయనున్నాడు. మ‌రోవైపు ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా ఎన్టీఆర్ క్రేజ్ యాడ్ చేస్తే సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ..ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమాలో కొమురం భీంగా క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్, త్రివిక్ర‌మ్, బుచ్చిబాబు ద‌ర్శ‌కత్వంలో సినిమాలు చేయ‌నున్నారు. మ‌రో వైపు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేయ‌నున్నారు.