1975లో అభిమానుల‌కు లేఖ రాసిన ఎన్టీఆర్.. వైర‌ల్‌గా మారిన లెట‌ర్

తెలుగు సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందిన నటుడు నంద‌మూరి తార‌క‌రామారావు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి, భావి తరాలకు దిక్సూచి. తెలుగు ప్ర‌జ‌ల‌చే అన్న‌గా పిలిపించుకున్న ఎన్టీఆర్ అశేష అభిమానాన్ని పొందారు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే.. కృష్ణుడు ఆయనే. వెండితెరపై ఆయన చేయని పాత్రలేదు. పౌరాణిక, ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేసేశారాయన. రాజ‌కీయాల‌లోను త‌న‌దైన ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ జ‌యంతి ఇటీవ‌ల ఘ‌నంగా జ‌రిగింది.

ఎన్టీఆర్ 98వ జ‌యంతి సంద‌ర్భంగా ఎంతో మంది ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. అభిమానులు ఆయ‌న జ‌యంత్యుత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రిపారు. అయితే ఎన్టీఆర్ రాసిన లేఖ ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 1975వ సంవత్సరంలో స్వహస్తాలతో ఆయన అభిమానులకు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రీన్ ఇంక్ పెన్ తో రాసిన ఆయన లేఖలో అభిమానులపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ‘‘అభిమానమును మించిన ధనము ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరు ప్రేమాను రాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే! నా శుభాకాంక్షలు. సోదరుడు రామారావు’’ అని లేఖను ముగించారు. 1975వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన ఈ లేఖను రాశారు ఎన్టీఆర్. ప్ర‌స్తుతం ఈ లేఖ వైర‌ల్‌గా మారింది.