NTR: ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు టైం ఫిక్స్‌.. ఫ‌స్ట్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

NTR: బుల్లితెర‌, వెండితెర అనే తేడా లేకుండా రికార్డులు సృష్టిస్తున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ షోతో బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న యంగ్ టైగర్ ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు అనే షో చేస్తున్నాడు. చాలా ఏళ్లుగా హిందీలో ప్రసారం అవుతోన్న ‘కౌన్ బనేగా కరోడ్ పతీ’ షో ఆధారంగా వచ్చిన దీనికి తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే పేరుతో నాగార్జున, చిరంజీవి సంద‌డి చేయ‌గా, ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో కొత్త సీజ‌న్‌ని ప్రారంభించ‌నున్నారు.

సామాన్యులను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో మొదలైన షోనే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ షో ఇప్ప‌టికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. నాలుగు సీజ‌న్స్ వెంటవెంట‌నే వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఐదో సీజ‌న్‌కి చాలా స‌మ‌యం ప‌ట్టింది.

అయితే, ఈ సారి దీనికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అని టైటిల్ మార్చారు. అంతేకాదు, ఈ సారి ఈ షోను స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేయబోతున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రోమోను ఆ మధ్య విడుదల చేశారు. ‘మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ‘‘ఎవరు మీలో కోటీశ్వరులు” త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ రావడంతో దీన్ని ప్రారంభించలేదు.

ఆగ‌స్ట్ 15 నుండి ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మం ప్రారంభం కానుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి తొలి గెస్ట్‌గా రామ్ చ‌ర‌ణ్ హాజ‌రు కానున్నార‌ట‌. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” సినిమాతో గత కొంతకాలంగా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఈ షోతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా విడుదలైన ఆర్ ఆర్ ఆర్ చిత్ర మేకింగ్ వీడియో ఇప్పటికే తెలుగు సినిమా అభిమానులను ఆకట్టుకొని యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

కరోనా సమయంలోనూ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు సంబంధించిన కంటెంస్టెంట్ల ఎంపిక ప్రక్రియను కొనసాగించారు. ఈ క్రమంలోనే షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. పది ఎపిసోడ్లకు ఒకసారి షూట్ జరిగింద‌ట‌. అయితే చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ను కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే జరపనున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఆ వెంటనే ఈ ప్రోమోను విడుదల చేసి.. షోను గ్రాండ్‌గా మొదలు పెడతారనే టాక్ బాగా వినిపిస్తోంది.