NTR: ఎన్టీఆర్-స‌మంత జోడీ క‌లిస్తే ఇలాంటి రికార్డులు న‌మోద‌వుతుంటాయా..!

NTR: టాలీవుడ్ క్రేజీ క‌పుల్స్‌లో ఎన్టీఆర్- స‌మంత జోడీ ఒక‌టి. వెండితెర‌పై వీరిద్ద‌రు బృందావ‌నం, రామ‌య్య వ‌స్తావ‌య్యా, జ‌నతా గ్యారేజ్ వంటి చిత్రాల‌లో క‌లిసి న‌టించారు.ఈ చిత్రాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచాయి. అయితే ఇప్పుడు వెండితెర‌పై కాకుండా బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి కథానాయిక సమంత వచ్చి సందడి చేశారు.

దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌-సమంతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘కూర్చొంటే భయంగా ఉంది’ అని సమంత అనగా, ‘ఉంటుంది. ఇది హోస్ట్‌ సీట్‌.. అది హాట్‌ సీట్‌’ అంటూ ఎన్టీఆర్‌ సమాధానమిచ్చారు. ‘సాధారణంగా ఎవరైనా వెయ్యి నుంచి కోటికి వెళ్తారు.. నువ్వు కోటి నుంచి వెయ్యికి వస్తే ఆట బాగుంటుంది కదా’ అని ఎన్టీఆర్‌ అనడంతో సమంత నవ్వేసింది.

ఆ తర్వాత ‘వదిలేయనా డబ్బు’ అని సమంత అనగా, ‘అయితే, క్విట్‌ అయిపోతావా’ అని ఎన్టీఆర్‌ అడిగారు. ‘మీరు ఇప్పుడు చెబుతున్నారు. ముందే చెప్పాలి కదా’ అని సమంత కాస్త అసహనం వ్యక్తం చేయడం ఆసక్తిగా అనిపించింది. వైవాహిక జీవితానికి ముగింపు పలికిన అనంతరం సమంత టీవీ షోలో కనిపించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఈ క్విజ్‌షోలో టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు రామ్‌చరణ్‌తో పాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ సందడి చేసిన సంగతి తెలిసిందే.

మంచి ఎంటర్టైనింగ్ గా కట్ చేసిన స‌మంత‌- ఎన్టీఆర్ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో 2.2 మిలియన్ కి పైగా వ్యూస్ తో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ కే ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేసిన మరో అదిరే ఎపిసోడ్ కి ఎలా ఉంటుందో ఊహించవచ్చు