డాక్టర్ బాబు మిస్సింగ్.. ‘కార్తీకదీపం’పై నెటిజన్ల సెటైర్స్!!
NQ Staff - November 8, 2020 / 03:35 PM IST

కార్తీక దీపం సీరియల్‌లో ఈ మధ్య భారీ మార్పులు వచ్చాయి. డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుపమ్ పరిటాల సీరియల్‌కు దూరంగా వెళ్లిపోయాడు. అయితే అదంతా కథలో భాగమా? లేదా నిజంగానే సీరియల్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడా? అన్న సంగతి మాత్రం తెలియడం లేదు. కొన్ని రోజుల నుంచి నిరుపమ్ పోషిస్తోన్న డాక్టర్ బాబు పాత్రకు వేరే గొంతు వినిపిస్తోంది. డబ్బింగ్ మారడంతో ఆ పాత్రను అంత రిసీవ్ చేసుకోలేకపోయారు.
అలా వాయిస్ మారి ఓ పది రోజులు అయిందో లేదో డాక్టర్ బాబు కూడా సీరియల్‌లో మాయమయ్యాడు. తల్లిదండ్రులు కావాలని పట్టుబట్టిన హిమ కోరికను నెరవేర్చడానికి, హిమ తల్లిదండ్రులను కనిపెట్టేందుకు డాక్టర్ బాబు ఇళ్లు వదిలి వెళ్లిపోయాడు. అయితే డాక్టర్ బాబు హిమ తల్లిదండ్రుల కోసం ఎక్కడని వెతుకుతాడు.. తానే తండ్రి అని, వంటలక్కే తల్లి అని తెలియని కార్తిక్ ఎక్కడ వెతుకుతాడో ఎప్పుడు తిరిగివస్తాడో తెలియడం లేదు.
అయితే ఈ వారంలో కార్తీక్ సీరియల్‌లో ఎక్కడా కనిపించలేదు. దీంతో కొందరు ఫ్యాన్స్ హర్టైనట్టున్నారు. కార్తీక్ మిస్ అయ్యాడు.. దొరికితే కనిపిస్తే వంటలక్కకు చెప్పండి అంటూ ఓ మీమ్ క్రియేట్ చేశారు. ఇందులో డాక్టర్ బాబు వివరాలను పొందుపరిచారు. ఆచూకి చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమతి అని సెటైర్ వేశాడు. ఈ మీమ్‌ను చూసిన నిరుపమ్ ఓరీ దేవుడా అంటూ దండం పెట్టేశాడు. దటీజ్ కార్తీకదీపం పవర్.