RADHE SHYAM: రాధేశ్యామ్ విష‌యంలో అస‌లు ట్విస్ట్ ఇదే.. లీకైన స‌మాచారం విని షాక్ అవుతున్న ఫ్యాన్స్

ప్ర‌భాస్ లేట్ అయిన లేటెస్ట్‌గా త‌న చిత్రాల‌తో అల‌రించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ లైన‌ప్ చూస్తుంటే మిగ‌తా హీరోల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ప్ర‌భాస్ చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉండ‌గా అవ‌న్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్ అనే చిత్రాన్ని ప్ర‌భాస్ చేస్తుండ‌గా, ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్, టీ సిరీస్ నిర్మాణంలో గోపి కృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా బాగా ఆకట్టుకుంది.


రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. 80వ దశకం నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చాలా వరకు సెట్స్ లో షూట్ చేశారు. మిగిలిన పార్టు కోసం సీజీ వర్క్ ను ఆశ్రయించారు. ఈ వర్క్ ను విదేశీ కంపెనీలకు అప్పగించడం.. అక్కడ కరోనా ఇబ్బందులు రావడంతో మరింత ఆలస్యం అవుతుందంట. దాంతో ఈ సమయంలోనే రీ-షూట్ కు సైతం వెళ్లారని టాక్. కాస్త లేట్ అయిన ప‌ర్లేదు కాని అంచ‌నాల‌కు మించేలా సినిమాను ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. రొమాంటిక్ పిరియాడికల్ ఎంటర్టైన్మెంట్ గా రానున్న ఈ సినిమాలో పూజ మెడికోగా పాత్రలో నటిస్తుందట. ప్రభాస్ ఓ ప్రమాదంలో చిక్కుకోగా ఆస్పత్రిలో చేరిన సమయంలో వీరి మధ్య పరిచయం పెరుగుతుందని వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. టైటానిక్ రేంజ్‌లో సినిమాని రూపొందిస్తుండ‌గా, ఈ సినిమాలో సముద్రం షిప్ యాక్సిడెంట్ జరుగుతుందని.. అంతేకాకుండా సముద్ర ప్రయాణానికి సంబంధించిన ఎపిసోడ్ హైలెట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ పెద్ద షిప్ లో ప్రభాస్, పూజా హెగ్డే ప్రయాణం చేస్తున్న సమయంలో.. ప్రమాదం జరుగుతుందని, అక్కడి నుంచే కథను మలుపుతారని.. ఇది దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తుంది. ప‌లు వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్న ఈ చిత్రం ఎప్ప‌టికి రిలీజ్ అవుతుందో చూడాలి.