Kappa Variant: కొత్త ర‌కం కరోనా.. యూపీలో క‌ల‌క‌లం సృష్టిస్తున్న ‘కప్పా’ వేరియంట్

Kappa Variant: ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి పులిస్టాప్ ఇప్ప‌ట్లో ప‌డేలా క‌నిపించ‌డం లేదు. రోజురోజుకు కరోనా మ‌హమ్మారి అనేక మార్పులు చెందుతూ ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తుంది. మొన్నటి వ‌ర‌కు డెల్టా వేరియెంట్ భార‌త్ ప్ర‌కంప‌న‌లు పుట్టిచింది. ఇప్పుడు ఈ వేరియెంట్ ఇత‌ర దేశాల‌కు పాకింది. యూకే, అమెరికా వంటి దేశాల‌లో డెల్టా వేరియెంట్ క‌ల‌క‌లం రేపుతుంది.

 Kappa Variant
Kappa Variantఇత‌ర వేరియెంట్‌ల‌తో పోల్చితే డెల్టా వేరియెంట్ అత్యంత ప్ర‌మాద‌కారిగా పరిణ‌మించింది. ఇప్పుడు ఈ డెల్టా వేరియెంట్ జ‌న్యు ఉత్ప‌రివ‌ర్త‌నాలు చెందుతూ కొత్త రూపం సంత‌రించుకుంది. డెల్టా వేరియంట్ డెల్టా ప్లస్‌గా మారినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ వైర‌స్ వ‌ల‌న మ‌న దేశంలో కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఈ భ‌యంతో ప్ర‌జ‌లంద‌రు వ‌ణికిపోతుంటే మ‌రో ర‌కం వైర‌స్ ఉత్తరప్రదేశ్‌లో బ‌య‌ట‌ప‌డింది.

తాజాగా కప్పా వేరియంట్‌ను గుర్తించినట్టు యూపీ అధికారులు ప్రకటించారు. కప్పా వేరియంట్‌కు త్వరగా వ్యాపించే లక్షణమున్నట్టు భావిస్తున్నారు. లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం కప్పా వేరియంట్‌ను నిర్ధారించారు. సంత్ కబీర్ నగర్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధుడిలో కప్పా వేరియంట్ గుర్తించారు. చనిపోయిన అతడి నమూనాలను సేకరించి జన్యు పరీక్షలు నిర్వహించగా, ఈ వేరియెంట్ ఉన్న‌ట్టు తేలింది.

జూన్ 13న నమూనాలను సేకరించి ఢిల్లీలోని సీఎస్ఐఆర్ జినోమిక్స్ ఇంటిగ్రేటివ్ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించగా.. ఫలితాలు కొద్ది రోజుల కిందట వచ్చాయి. వృద్ధుడికి మే 27న కోవిడ్ నిర్ధారణ కాగా.. జూన్ 12న సంత్ కబీర్ నగర్‌లోని బీఆర్డీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరానని మైక్రోబయాలజీ విభాగం హెడ్ డాక్టర్ అమ్రేశ్ సింగ్ తెలిపారు. నమూనాలను జూన్ 13న సేకరించామని, అతడు ఆ మర్నాడే చనిపోయాడని పేర్కొన్నారు.

కొత్త వేరియెంట్‌పై ఉత్తరప్రదేశ్ అదనపు చీఫ్ సెక్రటరీ (ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ స్పందిస్తూ, కప్పా వేరియంట్ పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దీనికి చికిత్స అందుబాటులో ఉందని వివరించారు. యూపీ నుండి 2000కి పైగా న‌మూనాల‌ని ప‌రీక్ష‌ల‌కు పంప‌గా, ఇందులో 80 శాతం డెల్టా, 6 శాతం ఆల్ఫా, రెండు డెల్టా ప్లస్ కేసులుగా నిర్ధారణ అయ్యాయని క‌నుగొన్నారు. రానున్న రోజుల‌లో ప‌లు చోట్ల క‌ప్పా వేరియెంట్ కూడా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.