Mangli: వివాదంలో మంగ్లీ పాట‌.. దేవుళ్లని అపహాస్యం చేయకు అంటూ కామెంట్స్

Mangli: ప్ర‌తి ప్ర‌య‌త్నంలో మంచి, చెడులు రెండు ఉంటాయి. సృజ‌నాత్మ‌క‌తలో అవి కాస్త ఎక్కువ‌గా ఉంటాయి. స్టార్స్ ఏం చేసిన దానిలో ఏదో ఒక త‌ప్పులు వెత‌క‌డం ఇటీవ‌ల కామ‌న్‌గా మారింది. ముఖ్యంగా భక్తి ప్రధానంగా సాగే వాటిలో వివాదాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి సినిమాలు అయిన పాట‌లు అయిన. తాజాగా మంగ్లీ పాడిన పాట ప్ర‌స్తుతం వివాదంలో నిలిచింది.

mangli

జాన‌ప‌ద గీతాల‌తో మెల్ల‌మెల్ల‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన మంగ్లీ..ఇప్పుడు సినిమాల‌లోను త‌న పాట‌తో అల‌రిస్తుంది. స్వ‌రంతోనే కాదు నృత్యంతోను రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. పండ‌గ వ‌స్తే మంగ్లీ పాట తప్ప‌ని స‌రిగా ఉండాలి అన్న చందంగా మారింది. బతుకమ్మ‌, సంక్రాంతి, ద‌స‌రా, శివ‌రాత్రి ఇలా ఏ పండ‌గ వ‌చ్చినా కూడా మంగ్లీ త‌న పాట‌ల‌తో యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది.

ఇప్పుడు తెలంగాణలో బోనాల ఉత్సవం ప్రారంభం అయింది. ఈ క్ర‌మంలో ‘చెట్టుకింద కూసున్నవమ్మా’ అంటూ సాగే బోనాల పాటని తీసుకొచ్చింది. ఇందులో ఆడిపాడింది మంగ్లీ. జూలై 11న విడుద‌లైన ఈ పాట‌కు సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే ఈ పాట‌లో అమ్మవారికి వాడిన ప‌దాలు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించేలా చేశాయి. ‘బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక. అలాంటిది.. అమ్మవారిని ఇలా అంటారా? అది దేవతని మొక్కినట్టులేదు తిడుతున్నట్టుంది

గతంలో ఎలాంటి పాటలు పాడావు. ఇప్పుడు ఎలా పాడుతున్నావు? భక్తి పేరుతో దేవుళ్లని అపహాస్యం చేయకు’ అంటూ మంగ్లీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లిరిక్స్ మార్చాల‌ని కొంద‌రు, క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని మ‌రి కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు. రామస్వామి రాసిన ఈ పాటకి రాకేశ్‌ వెంకటాపురం సంగీతం అందించారు దామురెడ్డి దర్శకత్వం వహించారు. ‘ఢీ’ ఫేం పండు నృత్య రీతులు సమకూర్చారు.

ఇక మంగ్లీ ల‌వ్ స్టోరీ సినిమా కోసం పాడిన సారంగ‌ద‌రియా పాట సెన్సేష‌న్ అవ‌డ‌మే కాక వివాదంలోను నిలిచిన విష‌యం తెలిసిందే. మంగ్లీ పాట‌కు సాయి ప‌ల్ల‌వి స్టెప్పులు తోడ‌వ‌డంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేసింది.