AKHIL: ఫోజులు కొడుతున్న అఖిల్.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకిపారేస్తున్న నెటిజ‌న్స్

అఖిల్ అంటే ఇక్కడ నాగార్జున వారసుడు కాదు.. బిగ్ బాస్ ఫేం అఖిల్ సార్ధక్. ఈ రియాల్టీ షో తర్వాత ఈ కుర్రాడికి మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు కొన్ని సినిమాలతో పాటు సీరియల్స్ చేసినా కూడా అఖిల్ ను ఎవరూ పెద్దగా గుర్తించలేదు. ఈయన గుర్తు పెట్టుకునే క్యారెక్టర్స్ కూడా చేయలేదు. అలాంటి సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు అఖిల్. మరీ ముఖ్యంగా అందులో హీరోయిన్ మోనల్ గజ్జర్ తో మనోడు నడిపిన లవ్ స్టోరీ ఎవర్ గ్రీన్ అంతే. కేవలం ఈ ప్రేమ కథతో అఖిల్ ఫైనల్ వరకు వచ్చాడు.

ఇదిలా ఉంటే బయటికి వచ్చిన తర్వాత తన కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నాడు అఖిల్. షోలో ఉన్నప్పుడు తనకు విలన్ పాత్రలంటే ఇష్టం అని చెప్పాడు అఖిల్. కానీ బయటికి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నాడు. ప్రస్తుతం హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. దాని పేరు ఫస్ట్ టైమ్. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.. కానీ ఈ సినిమా ప్రమోషన్ టైంలో అఖిల్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిని మీమర్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా దీని కంటే ముందు తానే 26 కథలు విన్నానని.. అందులో ఒక్క కథ కూడా నచ్చలేదు అని చెప్పాడు అఖిల్. చివరికి 27వ కథగా ఫస్ట్ టైం సినిమా స్టోరీ విన్నానని చెప్పాడు. ఈ మాటలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగా అన్ని కథలు విన్నా కూడా మీడియా ముందు అది చెప్పాల్సిన అవసరం లేదు అఖిల్.. రేపు ఈ సినిమా తేడా కొడితే కచ్చితంగా నిన్ను ఆడుకుంటారు.. ఆ విషయం మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ అంటూ సోషల్ మీడియాలో కొందరు అఖిల్ ను కామెంట్ చేస్తున్నారు. అందులోనూ నిజం లేకపోలేదు. సినిమా ఎలా వస్తుందో తెలియకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడాడు అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి దీనిపై అఖిల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Advertisement