Nani: నాని రెండు కాళ్లు పోగొట్టుకోనున్నాడా.. అవాక్క‌వుతున్న అభిమానులు

Nani: నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఇప్పటి వరకు 25 సినిమాలు పూర్తి చేసాడు. మరో 75 పూర్తి చేసి 100 సినిమాల మైలురాయి అందుకున్నా కూడా.. ఆయన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక సినిమా జెర్సీ. దీనికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. గెలిచేవాడి గురించి అందరూ చెబుతారు.. కానీ జెర్సీలో మాత్రం ఓడిపోతూ గెలిచిన ఒక తండ్రి కథ చూపించాడు గౌతమ్ తిన్ననూరి.

Nani
Nani

ఈ సినిమా విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. నాని కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన క్లాసిక్ జెర్సీ. కేవలం రెండో సినిమాతోనే గౌతమ్ తిన్ననూరి తన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రస్తుతం హిందీలో అదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు గౌతమ్ తిన్ననూరి. అక్కడ అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే జెర్సీ కాంబినేషన్ రిపీట్ అవుతుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నానితో మరోసారి గౌతమ్ తిన్ననూరి ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జెర్సీ అనేది పూర్తిగా ఫిక్షనల్ కథ. కానీ ఈసారి ఒక రియల్ హీరో జీవితాన్ని తెరపై చూపించబోతున్నారు ఈ ఇద్దరు. దేశం కోసం యుద్ధం చేసి తన రెండు కాళ్ళు పోగొట్టుకున్న ఒక రియల్ హీరో జీవిత కథ ఆధారంగా గౌతమ్ ఒక ఎమోషనల్ స్టోరీ రాసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో నాని అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడు అని ఆయన భావిస్తున్నాడు.

గౌతమ్ తిన్ననూరిపై నమ్మకంతో నాని కూడా ఈ బయోపిక్ చేయడానికి ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దేశం కోసం జరిగిన యుద్ధంలో తన రెండు కాళ్ళు పోగొట్టుకున్న ఒక తెలుగు సైనికుడు నిజజీవిత కథ ఆధారంగా.. ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందించబోతున్నాడు గౌతమ్ తిన్ననూరి. ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. వీటి తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి