Balakrishna: త‌న‌ను క‌లిసేందుకు ఎవ‌రు రావొద్దని బాల‌య్య విజ్ఞ‌ప్తి

Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరోల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. న‌టుడిగానే కాకుండా హిందూపురం ఎమ్యేల్యేగా బాల‌య్య ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ని గెలుచుకుంటున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారి ఆప‌న్న హ‌స్తంలా నిలిచే బాల‌య్య క‌రోనా స‌మ‌యంలో చాలా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే జూన్ 10 న బాల‌కృష్ణ బర్త్‌డే కాగా, ఆ రోజుని అభిమానులు పండుగ‌లా జ‌రుపుకుంటూ వ‌స్తున్నారు. కేక్‌లు క‌ట్ చేయ‌డం, బాణా సంచాలు కాల్చ‌డం, ప‌లు సేవా కార్యక్ర‌మాలు చేయ‌డం వంటివి చేస్తున్నారు. అయితే , ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొని ఉన్న తరుణంలో, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎవరూ తరలి రావొద్దని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. “నా ప్రాణ సమానులైన అభిమానులకు” అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుద‌ల చేశారు.

Balakrishna

“ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా నన్ను కలిసేందుకు నలుదిక్కుల నుంచి తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయటికి రావడం అభిలషణీయం కాదు. మీ అభిమానమే నన్ను ఇంతటివాడ్ని చేసింది… ఒక్క అభిమాని దూరమైనా భరించలేను. మీ అభిమానంతో సాటిరాగల ఆశీస్సు లేదు, మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపడమే నా జన్మదిన వేడుకగా భావిస్తాను. దయచేసి ఎవరూ రావొద్దు” అని బాలయ్య తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఈ విపత్కాలంలో అసువులు బాసిన అభిమానులకు, కార్యకర్తలకు, అభాగ్యులకు నివాళులు అర్పిస్తున్నానంటూ పేర్కొన్నారు.

ప్రతి ఏటా తన పుట్టిన రోజుని ఘనంగా నిర్వహించే అభిమానులకు, ఈ సారి బాలయ్య రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. జూన్ 10న‌ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తన మూడు సినిమాల అప్డేట్‌లు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లోని ‘అఖండ’ సినిమా టీజర్, యూట్యూబ్ రికార్డులని తిరగరాస్తోండ‌గా, ఈ సారి బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ లుక్ ఒక‌టి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తూనే ఉంది. దానికి సంబంధించిన అఫీషియ‌ల్ ప్రక‌ట‌న ఆ రోజు రానుంద‌ట‌. ఇక ఎంటర్టైన్మెంట్కే పెద్ద పీట వేసే అనిల్, ఊర మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య కాంబినేష‌న్‌లో రానున్న సినిమా అప్డేట్ కూడా ఆ రోజే వ‌స్తుంద‌నే టాక్స్ వినిపిస్తున్నాయి.