NAGARJUNA : గత ఏడాది కరోనా మహమ్మారి ఎంత విలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కన్నుమూశారు. కరోనా ఈ ఏడాది కాస్త తగ్గుముఖం పట్టిందని అందరు సంతోషం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పుడు కొన్ని చోట్ల సెకండ్ వేవ్, కొన్ని చోట్ల థర్డ్ వేవ్ నడుస్తుంది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా కాటుకు బలవుతారని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు ప్రతి ఒక్కరు విధిగా టీకాలు తీసుకోవాలంటూ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు విధిగా కోవిడ్ టీకా వేయించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా టీకా వేయించుకోవాలంటూ కోరారు.
తాజాగా అక్కినేని నాగార్జున కోవిడ్ టీకా ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన నాగార్జున ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా టీకా తీసుకోవాలని కోరారు. మనందరం కలిసి కోవిడ్‌ను తరిమి కొడదాం అంటూ నాగార్జున స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 2న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వైల్డ్ డాగ్ చిత్రాన్ని కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మన్ తెరకెక్కించాడు. కమర్షియల్ పంథా పక్కనబెట్టి పక్కా దేశభక్తి సినిమాగా ఈ సినిమా చేశాడు నాగార్జున. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) ఏజెంట్ విజయ్ వర్మగా నాగార్జున అదరగొట్టాడు. కొందరు సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులతో విజయ్ వర్మ చేసే పోరాటమే వైల్డ్ డాగ్ సినిమా. ఇందులో అలీ రెజా, ఆర్యా పండిట్, కాలెబ్ మాథ్యూస్, రుద్రా గౌడ్, హష్వంత్ మనోహర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సయామీ ఖేర్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. ఈ చిత్రం తర్వాత నాగార్జున బంగార్రాజు అనే సినిమా చేయనున్నాడు. మరో వైపు బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమానికి హోస్ట్‌గా కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది.