JanaSena : జనసేన పొత్తులపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
NQ Staff - January 21, 2023 / 07:18 PM IST

JanaSena : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది అనే విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి బిజెపితో జనసేన పార్టీ కలిసి మెలసి ఉంది.
టిడిపిని కూడా కలుపుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటే బిజెపి మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసేది లేదు అన్నట్లుగా దూరం ఉంటుంది. ఈ సమయంలో జనసేన పార్టీ అధినేత వ్యూహం ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది.
ఒకవైపు బిజెపితో కలిసి ఉంటూనే మరో వైపు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా జనసేనాని ఉంటున్నారు. ఈ విషయమై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు నగరంలో వీర మహిళల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వీర మహిళల సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది… ఎవరు ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనే విషయాలను పార్టీ అధినేత, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని పేర్కొన్నాడు.
ఆ విషయాల గురించి పార్టీలో మరెవ్వరు కూడా మాట్లాడడానికి వీలు లేదని స్పష్టం చేశారు. రాయలసీమ జిల్లాల్లో పార్టీ బలంగా ఉందని, దానిని పార్టీ కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని నాగబాబు సూచించారు. కచ్చితంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపించబోతుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.