Naandhi ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించాడు. ఆ బాధ్యతను తీసుకున్న అల్లరి నరేష్ కెరీర్ మొదట్లో బాగానే అలరించాడు. ఆయన సినిమాలకు మంచి ఆదరణ దక్కేది. యూత్, ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ కూడా అల్లరి నరేష్ సినిమాలకు క్యూ కట్టేవారు. తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ బ్రతికి ఉన్నప్పుడు హవా చూపించిన అల్లరోడు ఆ తర్వాత సరైన హిట్ కోసం తహతహలాడుతున్నాడు. ఆయన నటించిన చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో , ఎప్పుడు పోతుందో కూడా ఎవరికి అర్ధం కావడం లేదు. అయితే ఇప్పుడు నాంది అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులని తప్పక అలరించాలని అల్లరి నరేష్ కసి మీద ఉన్నాడు.
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘నాంది’ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ఎ న్యూ బిగినింగ్’ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. సామాజిక అంశాల మేళవింపుతో, క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం అల్లరి నరేష్ కామెడీ శైలికి డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ తన పన్ఫార్మెన్స్తో అదరగొట్టనున్నాడు. నాంది చిత్రం అల్లరోడికి 57వ చిత్రం కాగా, ఈ సినిమాకు అబ్బూరి రవి, చోటా కె. ప్రసాద్, శ్రీచరణ్ పాకాల, బ్రహ్మ కడలి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.
లాక్డౌన్ వలన ఈ సినిమా విడుదల కాస్త లేట్ అయింది. తాజాగా ఫిబ్రవరి 19న నాంది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ తెలియజేశారు. నాంది మూవీ రిలీజ్ డేట్ ప్రకటనతో అభిమానుల ఆనందం అవధులు దాటింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు ప్రచార చిత్రాలు విడుదల కాగా, అవి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్లో నరేష్ ఒంటి మీద దుస్తులు లేకుండా గాయాలతో తల కిందులుగా వేళాడుతూ ఉన్నట్టు చూపించారు. టీజర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాతోనైన అల్లరి నరేష్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాడా అనేది చూడాలి.