Mugguru Monagallu: కామెడీ నేప‌థ్యంలో శ్రీనివాస్ రెడ్డి చిత్రం.. వైవిధ్యంగా ఉన్న ట్రైల‌ర్

గ‌తంలో కేవ‌లం క‌మెడీయ‌న్‌గానే అల‌రించిన శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు హీరోగాను రాణిస్తున్నాడు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, జంబలకిడిపంబ వంటి సినిమాలు చేశాడు. ఇందులో కొన్ని చిత్రాలు విజ‌యం సాధించ‌డంతో కొత్త ప్ర‌యోగాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ముగ్గురు మొనగాళ్లు పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కామెడీతో పాటు థ్రిల్లింగ్‌గా ఉండ‌నుంది. చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు . చాలా గ్యాప్ తర్వాత మళ్లీ శ్రీనివాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుండ‌గా, కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

వినికిడి లోపం, అంధత్వం, మూగతనం లాంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు మిత్రుల జీవితంలో జరిగిన ఆసక్తికర ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు. ఇందులో శ్రీనివాసరెడ్డికి వినపడదు.. దీక్షిత్ శెట్టి మూగవాడు.. వెన్నెల రామారావుకు కనపడదు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. కొన్ని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబబ్బ న‌వ్విస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి వినికిడి లోపం ఉన్న వ్య‌క్తిగా అద్భుతంగా న‌టించారు. త్విష్ శర్మ, శ్వేతా వర్మ ఈ సినిమాలో హీరోయిన్స్ గా కనిపించనున్నారు.