Mokshagna: బాల‌కృష్ణ‌ డైరక్షన్ లో మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీ

Mokshagna: వెండితెర‌కు వార‌సుల‌ని ప‌రిచ‌యం చేయ‌డం కొత్తేమి కాదు. పాత త‌రం నుండి నేటి త‌రం వ‌ర‌కు వారసుల రాక కొన‌సాగుతూనే ఉంది. ఇందులో కొంత మంది స‌క్సెస్ అయితే మ‌రి కొంద‌రు చేతులు కాల్చుకొని ఆ రంగం నుండి త‌ప్పుకున్నారు.అయితే ఎప్ప‌టి నుండో నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీకి సంబంధించి ప్ర‌చారాలు న‌డుస్తూనే ఉన్నాయి. ఈ సినిమాతో ఎంట్రీ ఉంటుంది, ఆ సినిమాతో ఎంట్రీ ఉంటుంద‌ని ప‌లువురు జోస్యాలు చెప్పిన‌ప్ప‌టికీ ఏది నిజం కాలేదు.

Mokshagna Debut Movie in Balakrishna Direction
Mokshagna Debut Movie in Balakrishna Direction

బాలయ్య త‌న 61వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానుల‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఎట్ట‌కేల‌కు మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీకి సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేశారు. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ఆదిత్య 369 సీక్వెల్ లో తన త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌తో కలిసి తాను న‌టించ‌బోతున్న‌ట్టు స్ప‌ష్టం చేశాడు.

గతంలో తాను నటించిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ రానుందని, ఆ సినిమాతోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని బాలయ్య చెప్పారు. అంతేకాదు ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపి మరింత ఆసక్తి రేకెత్తించారు. తన తండ్రి ఎన్టీఆర్ తాతమ్మకల అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఫస్ట్ మూవీ కోసం అలాంటి మెళుకువలు నేర్పిస్తానని బాలకృష్ణ తెలిపారు.

బాలయ్య పుట్టినరోజున ఆయన కొడుకు ఎంట్రీపై క్లారిటీ ఇవ్వ‌డంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక క‌రోనా వ‌ల‌న త‌న‌బ‌ర్త్ డే వేడుక‌ల‌ని బాల‌య్య సింపుల్‌గా జ‌రుపుకున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అక్కడి హాస్పిటల్ సిబ్బందితోని మరియు అక్కడి చిన్నారుల నడుమ ఒక రకమైన ఆహ్లాదకర వాతావరణంలో తన తల్లిదండ్రులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, బసవతారకం గారి ఆశీస్సులతో బాలయ్య తన జన్మదిన వేడుకలు జరుపుకున్నానని బాల‌య్య త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ ఆవరణలో 500మంది నిరుపేదలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందించారు. బాలయ్య వీరాభిమాని అయిన యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఈ కార్యక్రమాన్ని మంచి సేవాతత్పరతతో నిర్వహించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న‌కు క‌లిసొచ్చిన డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీనుతో క‌లిసి అఖండ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.