Modi: ప్ర‌ధాని నోట బాహుబ‌లి మాట‌.. ఎందుకన్నారో తెలుసా?

Modi:బాహుబ‌లి ఈ పేరు ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు సైతం ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. రాజ‌మౌళి క్రియేట్ చేసిన మ్యాజిక్‌తో బాహుబ‌లి పేరు రాజ‌కీయ నాయ‌కుల నోట కూడా వ‌స్తుంది. గ‌తంలో రాజకీయాల‌కు సంబంధించిన ప్ర‌చారాల‌లో బాహుబ‌లి పేరు ఎంత‌గా మారుమ్రోగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా న‌రేంద్ర మోదీ నోట బాహుబ‌లి పేరు వినిపించ‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సంద‌ర్భంగా విపక్షాలు ఇంధన ధరల పెంపు, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసన వంటి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని మోదీ పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో తాజాగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ మిమ్మల్ని బాహుబలిగా మారుస్తుంది.. కనుక ప్రతి ఒక్కరు టీకా వేసుకోవాలని నరేంద్ర మోదీ అభ్యర్థించారు.

ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు. ‘‘భుజాలకు టీకా తీసున్నవారంతా బాహుబలిగా మారతారు. ఇప్పటికే 40 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం ఒక్క డోస్‌ టీకా అయినా తీసుకుని బాహుబలులుగా మారారు. వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంది. దీని గురించి పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు మోదీ. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో బాహుబలి సినిమా ప్రస్తావనను మోదీ అనేక సార్లు తెచ్చారు.

మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండటంతో.. నరేంద్ర మోదీ తన గొడుగు తానే పట్టుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పార్లమెంట్‌ సమావేశాలు ఫలవంతంగా సాగాలని, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లభించాలని ఆశిస్తున్నానంటూ మోదీ పేర్కొన్నారు. విపక్ష సభ్యులు కఠిన ప్రశ్నలు సంధిస్తూ.. సభ సజావుగా సాగేలా సహకరించాలన్నారు. ప్రభుత్వం అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని.. అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.

మహమ్మారిపై పోరుకోసం.. ఫ్లోర్ లీడర్లతో చర్చించాలనుకుంటున్నామని మోదీ పేర్కొన్నారు. ఎంపీల నుంచి కూడా సలహాలను స్వీకరిస్తామని తెలిపారు. క్ర‌మ‌శిక్ష‌ణ వాతావ‌ర‌ణంలో స‌మావేశాలు సాగాల‌న్నారు. ఇది ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోప‌తం చేస్తుంద‌న్నారు. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగి, అభివృద్ధి వేగ‌వంతం అవుతుంద‌ని మోదీ చెప్పారు.