Perni Nani: సినిమా పెద్ద‌లే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మాల‌ని చెప్పారు: పేర్ని నాని

Perni Nani: కొద్ది రోజులుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం ఏంటంటే సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారం. ప్రభుత్వం ఆన్ లైన్ సినిమా టిక్కెట్ల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం పైన రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ సినిమా టిక్కెట్ల అమ్మకాలు చేయటం ఏంటంటూ ప్రశ్నించాయి. తాజాగా దీనిపై పేర్నీ నాని స్పందించారు.

Perni Nani

సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లే సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్మాలని కోరార‌ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సినిమా టిక్కెట్ల అమ్మకం విషయంలో పన్ను ఎగవేత జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్‌ టిక్కెట్లు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

సినిమా టిక్కెట్స్‌ని ప్ర‌భుత్వం అమ్మాల‌నే దానిపై ఇంకా పూర్తి నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పారు.క‌మిటీ నివేదిక వ‌చ్చాక ప‌రిశీలిస్తాం అని చెప్పారు. అయితే మీడియా స‌మావేశంలో నాని గంద‌ర‌గోళ స‌మాధానాలు అంద‌రికి అనేక అనుమానాలు క‌లిగిస్తున్నాయి. ఓ సారి నిర్ణయం తీసుకున్నామంటారు. మరోసారి ఇంకా నిర్ణయించలేదంటారు. మరోసారి సినీ పరిశ్రమ పెద్దలే టిక్కెట్లు ప్రభుత్వం అమ్మాలని సూచించారన్నారు.

ఇర‌వ‌య్యవ తేదీన టాలీవుడ్ పెద్ద‌ల‌తో స‌మావేశం అయిన త‌ర్వాత వీటిపై పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక నాని.. సినీ పెద్ద‌ల‌పై చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, దీనిపై చిరంజీవి టీం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.