F2 : మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఎఫ్ 2 బ్యూటీ నిశ్చితార్ధం.. సడెన్ షాక్ ఇచ్చిన మెహరీన్
Samsthi 2210 - February 13, 2021 / 07:11 PM IST

F2 : టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హంగామా కొనసాగుతూనే ఉంది. హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. గత ఏడాది కాజల్ అగర్వాల్, నిహారిక వంటి అందాల భామలు పెళ్లిపీటలెక్కగా ఈ ఏడాది ఎఫ్ 2 ఫేం మెహరీన్ కౌర్ తను ఇష్టపడిన వ్యక్తిని పరిణయమాడేందుకు సిద్ధమైంది. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, పంజాబీలో పలు చిత్రాల్లో బిజీగా మారిపోయింది. తెలుగులో నాగశౌర్య హీరోగా వచ్చిన అశ్వత్థామ చిత్రంలో చివరగా కనిపించింది.
మహానుభావుడు, రాజా దిగ్రేట్, జవాన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మెహరీన్ కౌర్ ఎఫ్ 2 చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల మనసులని గెలుచుకుంది. హారిక అనే పాత్రలో ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 చిత్రంలో వరుణ్ తేజ్‌తో మరోసారి జోడి కడుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగగంగా జరుగుతుండగా, ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న విడుదల చేయనున్నారు. అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, తమన్నా కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే మెహరీన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మెహరీన్ కౌర్ .. హర్యానాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు, దివంగత భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య భిష్ణోయ్‌ను పెళ్ళాడేందుకు సిద్దమైంది. మార్చి 13న వీరి నిశ్చితార్దం జరగనుండగా, ఆ తర్వాత కొద్ది రోజులకు పెళ్ళి వేడుక జరగనుంది. అయితే వీరి నిశ్చితార్థం రాజస్థాన్‌లోని జోధ్ పూర్ విల్లాలో జరపనుండగా, ఈ వేడుకకు రెండు కుటుంబాలు మాత్రమే హాజరు కానున్నాయి. వాళ్ళతో పాటు మరికొందరు సన్నిహితులు మాత్రమే రానున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల కిందట భవ్య, మెహ్రీన్ మధ్య పరిచయం ఏర్పడగా, అది ప్రేమగా మారిందట. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్ళి పీటలెక్కేందుకు కూడా వీరిద్దరు సిద్ధమయ్యారు.