Chiranjeevi : నేను ‘ప్రాణ’దానం చేస్తున్నా. మీరు రక్తదానం చేయండి.. ఫ్యాన్స్ కి ‘మెగా’ రిక్వెస్ట్..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఆక్సీజన్ బ్యాంక్ ని ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా ఆయన ఎంతో మంది కరోనా బాధితులకు ప్రాణవాయువును అందిస్తున్నారు. అదే సమయంలో తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేయటానికి ఫ్యాన్స్ ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నేపథ్యంలో రక్తదాతల సంఖ్య భారీగా తగ్గినందున బ్లడ్ నిల్వలు అడుగంటాయని మెగాస్టార్ ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ ఆస్పత్రుల్లో ఎంతో మంది పేషెంట్లు రక్తం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.

Chiranjeevi

ఒక్కరా.. ఇద్దరా..

గుండె ఆపరేషన్ చేయించుకునేవాళ్లు, డెలివరీకి వచ్చిన గర్భిణులు, తలసీమియా రోగులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్లు.. ఇలా ఒక్కరా ఇద్దరా.. వందల సంఖ్యలో ప్రజలు రక్తం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ల అవస్థలను, అత్యవసరాలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో ముందడుగు వేయాలని నా అభిమానులకి, రక్తదాతలకి నమస్కరించి విన్నవిస్తున్నానని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ ఎప్పటి నుంచో తన బ్లడ్ బ్యాంక్ ద్వారా పేదలను ఆదుకుంటున్న విషయం విధితమే. అదే క్రమంలో ఆయన మరోసారి రక్తదానం ఆవశ్యకతను వివరించారు. రక్తదానం చేయండి.. ప్రాణాలను నిలబెట్టండి.. అది ఇచ్చే ఆత్మ సంతృప్తి అంతా ఇంతా కాదు అని పేర్కొన్నారు.

Chiranjeevi

పోలీసులు అడ్డుకుంటున్నారా?..

‘‘రక్తదానం చేయటానికి వస్తుంటే పోలీసులు లాక్ డౌన్ రూల్స్ పేరుతో అడ్డుకుంటున్నట్లు చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. అందుకే తాము ఈ పని చేయలేకపోతున్నామని అంటున్నారు. ఇలాంటి అనుభవం ఎదురైతే మీరొక పని చేయండి. దగ్గరే ఉన్న బ్లడ్ బ్యాంకులు లేదా హాస్పిటల్స్ ని సంప్రదించి విషయం చెప్పండి. వాళ్లు ఆ వివరాలను రక్తం అవసరం ఉన్న ఆస్పత్రికి తెలుపుతారు. అప్పుడు వాళ్లు మీకు వాట్సప్ లో ఒక ఫామ్ పంపిస్తారు. దాన్ని చూపిస్తే అందులోని డేట్, టైమ్ చూసి పోలీసులు అనుమతిస్తారు. లేదా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా రక్తదాతల కోసం రెండు ప్రత్యేక ఫోన్ నంబర్లను (9490617440, 9490617431) అందుబాటులో ఉంచారు. వాటికి కాల్ చేసినా చాలు. పోలీసులే వచ్చి మిమ్మల్ని బ్లడ్ బ్యాంక్ వద్ద డ్రాప్ చేస్తారు’’ అని మెగాస్టార్ చిరంజీవి వివరించారు.