Chiranjeevi: ప్రభుత్వం పై.. ‘మెగాస్టార్’ అసంతృప్తి.. ఆవేదన..

Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి.. ప్రభుత్వం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు విషయంలో ఆయన ఇలా ఆవేదనతో స్పందించారు. ఈ రోజు మంగళవారం దాసరి 74వ జయంతి. ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్.. ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఒకే ఒక్క తెలుగు డైరెక్టర్ దాసరి నారాయణరావు అని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి ప్రభుత్వపరంగా ఇప్పటికీ సరైన గుర్తింపు లభించలేదని చిరంజీవి తప్పుపట్టారు. తెలుగు చలన చిత్ర సీమకు దాసరి నారాయణరావు చేసిన అద్భుతమైన, మరపురాని సేవలను గుర్తించి ఇప్పటికైనా ఆయనకి విశిష్టమైన పద్మ పురస్కారాన్ని ఇవ్వాలని కోరారు.

మొత్తం పరిశ్రమకే గౌరవం

‘‘దాసరి నారాయణరావు స్టార్ హీరోలతోనే కాదు. కొత్త నటీనటులతో కూడా మూవీలు తీసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన అపూర్వ దర్శకత్వ ప్రతిభాశాలి. ఇండస్ట్రీతోపాటు అభిమానుల మనసుల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. విజయాల్లో ఒకదాన్ని మంచి మరొకటి అనే రీతిలో దాసరి తన చిత్రాలను రూపొందించారు. అంతేకాదు. పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తపించారు. ఈ దిశగా ఆయన చేసిన కృషి ఎవరికైనా, ఎప్పటికైనా ఆదర్శమే. మార్గదర్శకమే. ఆయన్ని ఇవాళ టాలీవుడ్ మొత్తం మనస్ఫూర్తిగా స్మరించుకుంటోంది. దాసరికి మరణానంతరమైనా అవార్డు దక్కితే అది మొత్తం తెలుగు సినీ పరిశ్రమకే దక్కే గౌరవం అవుతుంది’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

తీరని లోటు..

‘‘నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనను తాను నిరూపించుకున్న దాసరి నారాయణ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇదే నా స్మృత్యంజలి’’ అంటూ ట్వీట్ ని ప్రారంభించిన చిరంజీవి.. దాసరికి ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవటం ఒక తీరని లోటని చెప్పారు. ఈ విషయంలో మెగాస్టార్ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని గానీ ఏపీ సర్కార్ ను గానీ తెలంగాణ గవర్నమెంట్ ని గానీ తప్పుపట్టలేదు. ప్రభుత్వం అన్నారు తప్పు ఏ ప్రభుత్వం అనేది స్పష్టంగా చెప్పలేదు.

Advertisement