SIRI VENNELA : సాహిత్యానికి ఇది చీక‌టి రోజు.. భావోద్వేగానికి గురైన చిరంజీవి

SIRI VENNELA : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే.లంగ్ క్యాన్స‌ర్‌తో మృతి చెందిన‌ట్టు వైద్యులు పేర్కొన్నారు. మంగ‌ళవారం శాస్త్రి మృత‌దేహాన్ని ఆసుప‌త్రిలోనే ఉంచ‌గా, ప‌లువురు ప్ర‌ముఖులు క‌డ‌సారి ద‌ర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి.. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు చిరంజీవి.

mega star chiranjeevi about SIRI VENNELA death
mega star chiranjeevi about SIRI VENNELA death

ఈ రోజు సాహిత్యానికి చీకటి రోజని చిరంజీవి అన్నారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.మెగాస్టార్ సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విచారం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మరణంతో తన గుండె తరుక్కుపోతోందని, బరువెక్కిపోతోందని చిరు అన్నారు.

తెలుగు సినీపరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీచేయలేరని చెప్పారు. ఎంతో మందిని శోక సముద్రంలో ముంచి దూరమైపోయిన ఆయన నిజంగా మనందరికీ, ఈ సాహిత్య లోకానికి అన్యాయం చేశారని చెప్పారు. ఆయన వస్తాడు అనుకున్నాం.. కాని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు.

కొద్దిసేపటి క్రితమే ఆయన పార్థివదేహాన్ని అభిమానులు సినీ ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. దర్శకుడు రాజమౌళి, కీరవాణి సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించారు. నేడు ఫిల్మ్ నగర్‏లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది.

దీంతో ఆయనకు సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. సిరివెన్నెల గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. ఎక్మో మిషన్ పై ఉన్న తర్వాత.. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ కావడంతో ఇన్‏ఫెక్షన్ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం 4 గంటల 7 నిమిషాల ప్రాంతంలో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు.