Mahati Swarasagar: ఘ‌నంగా మ‌ణిశ‌ర్మ త‌న‌యుడి వివాహం.. హాజ‌రైన ప్ర‌ముఖులు

Mahati Swarasagar మ్యూజిక్ లెజెండ్ మ‌ణిశ‌ర్మ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన తనయుడు, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌.. గాయని సంజనా కలమంజేని వివాహం చేసుకున్నాడు. చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 10:30గంటలకు జరగ‌గా, పెళ్లి వేడుక‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.

కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, సినీ సెల‌బ్స్ మ‌ధ్య ఈ పెళ్లి వేడుక జ‌రిగింది. కొద్ది రోజులు క్రితం హైదరాబాద్‌లో మహతి, సంజనాల నిశ్చితార్థం జరగగా, ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి.

సంజనా ‘భీష్మ’ చిత్రంలో ‘‘హే చూశా’’ అనే గీతం ఆలపించింది. నితిన్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్‌ స్వరాలందించారు . మణిశర్మ కుమారుడు సాగర్ మహతి కూడా సంగీత దర్శకుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన ‘ఛలో, భీష్మ, మ్యాస్ట్రో’ వంటి చిత్రాలకు సంగీతం అందించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

తన తండ్రి పని చేసే చిత్రాలకు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు మ‌హ‌తి. ఆయ‌న భార్య పలు తమిళ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు. వీరిద్ద‌రికి ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక మణి శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సంగీతంతో కొన్నాళ్లపాటు తెలుగువారిని అలరించారు.

చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఆయన ఇచ్చే సంగీతం ఓ రేంజ్‌లో ఉంటుంది. వీణపై ఆయన చేసిన ప్రయోగాలు.. చాలా పాపులర్. మణిశర్మ మొదటగా 1992‌లో వచ్చిన రాంగోపాల్ వర్మ “రాత్రి” అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఆయన నేపథ్య సంగీతాన్ని అందించారు.