Maniratnam: రాజమౌళి ‘బాహుబలి’ తనకు స్ఫూర్తినిచ్చిందన్న మణిరత్నం
NQ Staff - April 9, 2022 / 10:31 PM IST

Maniratnam: ఇప్పుడు మనం కొత్తగా పాన్ ఇండియా సినిమాలంటున్నాంగానీ, నిజానికి.. పాన్ ఇండియా సినిమాలు గతంలోనే వచ్చాయ్. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వుండేది. మణిరత్నం దర్శకత్వ ప్రతిభను కొనియాడని సినీ ప్రముఖుడు దేశంలో లేరనడం అతిశయోక్తి కాదు. మణిరత్నం సినిమాల్లో నటించడమంటే ‘నేర్చుకున్నట్లే’ అని భావిస్తారు చాలామంది.

Maniratnam Says that he was inspired by Rajamouli’s Bahubali
మరి, అలాంటి మణిరత్నం.. తాను రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చూసి స్ఫూర్తి పొందానని చెప్పడమంటే, అది రాజమౌళికి ఎంత గౌరవం.? అసలు విషయమేంటంటే, ‘పొన్నియన్ సెల్వమ్’ అనే పేరుతో మణిరత్నం ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిజానికి చాలాకాలంగా ఈ ప్రాజెక్టుని మణిరత్నం తెరకెక్కించేందుకు తటపటాయించారు.
ఎప్పుడైతే ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ అనూహ్యంగా విస్తరించిందో, అప్పుడే ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారు మణిరత్నం. తాజాగా మణిరత్నం, రాజమౌళి ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత సినీ రంగం తీరు తెన్నుల గురించి చర్చించుకున్నారు. ఇరువురూ తమ తమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక, మణిరత్నం గతంలో రజనీకాంత్ నుంచి షారుక్ ఖాన్ వరకూ చాలామంది మేటి నటులతో, స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. వాటిల్లో చాలావరకు పాన్ ఇండియా సినిమాలే.