CHIRANJEEVI: మెగాస్టార్ సినిమా టైటిల్స్‌పై మ‌క్కువ చూపిస్తున్న మేక‌ర్స్..డ‌జ‌ను సినిమాల టైటిల్స్‌తో బ‌య‌ట‌కొచ్చిన కొత్త సినిమాలు

స్వ‌యంకృషితో పైకి వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. ఆయ‌న సినిమాల‌కు సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం ఫిదా అవుతుంటారు. ఒకానొక ద‌శ‌లో చిరంజీవి సినిమాలు చేయ‌డం మానేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి లెజండ‌రీ స్టార్ సినిమాలు చేయాల‌ని కోరారు. ఎట్ట‌కేలకు ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో త‌న 150వ సినిమా చేశాడు చిరు. ఈ 150 చిత్రాల‌లో ఎన్నో సూప‌ర్ హిట్స్. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు తిరగ‌రాసిన ఎన్నో చిత్రాలు ఉన్నాయి. అయితే ఆ హిట్ చిత్రాల‌పైన ఇప్ప‌టి మేకర్స్ క‌న్నుప‌డింది.

Chiranjeevi

పాత సినిమా టైటిల్‌ని ఉప‌యోగించుకునేందుకు ఎలాంటి అభ్యంత‌రాలు లేక‌పోవ‌డంతో ఇటీవ‌లి కాలంలో చాలా సినిమాలకు పాత సినిమాల పేర్లు పెడుతున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఫిల్మ్ మేకర్స్ పాత టైటిల్స్ వెంట పడుతున్నారు. చిరంజీవి నటించిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను సినిమాల టైటిల్స్ మళ్లీ వచ్చాయి. చిరంజీవి సూపర్ హిట్ మూవీ విజేత టైటిల్ ను ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ త‌న మొద‌టి సినిమాకే ఉప‌యోగించుకున్నాడు. ఇక అల్ల‌రి న‌రేష్ యముడికి మొగుడు అంటూ హీరోగా ఓ సినిమా చేశాడు. బిల్లా రంగా టైటిల్‌తోను ఓ సినిమా వ‌చ్చింది.

గూడచారి నెం.1 టైటిల్ తో చాలా ఏళ్ల క్రితమే అర్జున్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా సినిమా వచ్చింది. ప్రాణం ఖరీదు సినిమా టైటిల్ ను ఇటీవల ఒక సినిమాకు వినియోగించారు. ఇక చిరు సూపర్ డూపర్ హిట్ మూవీ పున్నమి నాగు టైటిల్ తో ముమైత్ ఖాన్ ఒక సినిమా ను చేసింది. సూపర్ హిట్ మూవీ ‘రాక్షసుడు’ టైటిల్ ను బెల్లంకొండ హీరోగా నటించిన ఒక రీమేక్ కు వినియోగించారు. చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాల్లో ఒక్కటైన గ్యాంగ్ లీడర్ టైటిల్ తో నాని వచ్చాడు. ఇక ట్రెండ్ సెట్టర్ మూవీ చిరు ఖైదీ టైటిల్ ను కార్తీ కోసం లోకేష్ కనగరాజ్ ఉపయోగించాడు. చిరు దొంగ టైటిల్ ను కూడా కార్తీ నే మళ్లీ వినియోగించాడు. ఇక మాస్టర్ టైటిల్ తో తమిళంలో విజయ్ ఒక సినిమాను చేశాడు అది తెలుగులో కూడా మాస్టర్ గానే వచ్చింది. ముగ్గురు మొనగాళ్లు సినిమా టైటిల్ ను కూడా ఇటీవల ఒక కొత్త సినిమా కోసం మ‌ళ్లీ వాడు. మొత్తంగా చిరంజీవి న‌టించిన‌ 12 సినిమాలకు సంబంధించిన టైటిల్స్ ని మ‌ళ్లీ వాడేయ‌డం విశేషం.