Mahesh Kathi: మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన క‌త్తి మ‌హేష్‌

Mahesh Kathi: క‌త్తి మ‌హేష్‌.. ఈ పేరు ఇటీవ‌లి కాలంలో చాలా ఫేమ‌స్. మొదట్లో సినీ క్రిటిక్‌గా ఉన్న క‌త్తి మ‌హేష్ బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ త‌ర్వాత ప‌లు వివాదాలతోను ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌చ్చాడు కత్తి మ‌హేష్‌. అయితే ఇటీవ‌ల కత్తి మహేశ్‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది.

Mahesh Kathi

మహేశ్‌ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో ఆయ‌న‌ని, చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎడమ కంటికి తీవ్రగాయమైనట్లు వైద్యులు తెలిపారు. అయితే నిన్నమొన్న‌టి వ‌ర‌కు క‌త్తి మ‌హేష్ ఆరోగ్యం బాగానే ఉంద‌ని, కాక‌పోతే అత‌డి ఎడ‌మ కంటి చూపు పోయే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెప్పారు.

కొద్ది సేప‌టి క్రితం మ‌హేశ్ మృతిని చెన్నై అపోలో ఆస్ప‌త్రి వైద్యులు ధృవీక‌రించారు. మ‌హేష్ మృతికి సంబంధించిన వార్త బ‌య‌ట‌కు రాగానే అభిమానులు ఉలిక్కిప‌డ్డారు. అత‌ని శ్రేయోభిలాషులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. మ‌హేష్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్రార్ధించారు.

Mahesh Kathi

కత్తి మహేష్‌ది సొంత జిల్లా చిత్తూరు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జ‌రిగింది.క‌త్తి మ‌హేష్‌తో పాటు కారులో ఉన్న వారంద‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా, ఆయ‌న మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవ‌ల క‌త్తి మ‌హేశ్ ఆస్ప‌త్రి ఖ‌ర్చుల నిమిత్తం ఏపీ సీఎం జ‌గ‌న్ భారీ ఆర్థిక సాయం అంద‌జేశారు. క‌త్తి మ‌హేశ్ చికిత్స కోసం రూ.17 ల‌క్ష‌లు విడుద‌ల చేసిన‌ట్లు సీఎం క్యాంప్ ఆఫీసు ప్ర‌క‌టించింది. ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి నుంచి ఈ ఆర్థిక‌సాయం అంద‌జేశారు.